గాజు గ్లాసు : బీజేపీ ఆటలో భాగమేనా ?!

ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం కూటమికి ఆశనిపాతం అనే చెప్పాలి.

Update: 2024-04-22 02:30 GMT

లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీకి, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఊహించని పరిణామం ఎదురయింది. ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయిస్తామని, మిగిలిన 154 శాసనసభ, 23 లోక్ సభ స్థానాల్లో కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయిస్తామని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం కూటమికి ఆశనిపాతం అనే చెప్పాలి. పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు, సైకిల్, కమలం పువ్వు గుర్తులను చూపిస్తూ ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నారు. అటు లోక్ సభ, ఇటు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఏ ఈవీఎంలో ఓటర్లు ఏ గుర్తుకు ఓటు వేస్తారో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమీషన్ తాజా నిర్ణయం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందా అని భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా మద్దతు తమకే ఉంటుందన్న ధీమా బీజేపీకి ఉంది. అందుకే రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగానే బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తుందని, గాజుగ్లాసు కేటాయింపులో ఎన్నికల కమీషన్ నిర్ణయం అందులో భాగమేనని భావిస్తున్నారు.

ఎన్నికల కమీషన్ తో పాటు ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలన్నీ బీజేపీ కనుసన్నలలోనే పనిచేస్తున్నాయని, బీజేపీ నేతలను వదిలి విపక్ష నేతలపై దాడి చేస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయా శాఖల నిర్ణయాలు అదేవిధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషన్ నిర్ణయంలో బీజేపీ పెద్దల ప్రమేయం ఉందన్న వాదనకు బలం చేకూరుతుంది.

Tags:    

Similar News