ఎన్నిక‌ల‌ను డ‌బ్బులు మేనేజ్ చేస్తున్నాయా? నిజ‌మేంటి?

మ‌రో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉండ‌గా.. డ‌బ్బుల ప్ర‌స్తావ‌న తీవ్రంగా వినిపిస్తోంది

Update: 2024-05-10 15:30 GMT

మ‌రో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉండ‌గా.. డ‌బ్బుల ప్ర‌స్తావ‌న తీవ్రంగా వినిపిస్తోంది. ఏపీలోని వైసీపీ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ఏకంగా 42 వేల కోట్ల రూపాయ‌ల‌ను డీబీటీ ద్వారా ల‌బ్ధి దారుల‌కు పంపిణీ చేయాల్సి రావ‌డం.. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘం అడ్డు చెప్ప‌డం.. ఈ విష‌యంలో కోర్టు జోక్యం చేసుకుని శుక్ర‌వారం ఒక్క‌రోజు మాత్ర‌మే డ‌బ్బులు పంపిణీ చేసుకునేలా అవ‌కాశం ఇవ్వ‌డం వంటివి రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు.. భారీ ఎత్తున జ‌గ‌న్‌.. ల‌బ్ధిదారుల పేరుతో ఓట‌ర్ల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని.. విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంత‌కు మించి.. ఎక్క‌వగా మాట్లాడే ప‌రిస్థితి వాటికి కూడాలేదు. అయితే.. నిజంగానే ఎన్నిక‌ల‌కు ముందు డ‌బ్బులు పంచేస్తే.. ప్ర‌భుత్వాల‌ను తిరిగి ఎన్నుకుంటారా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు రుజువు కాలేదు. ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌సుపు-కుంకుమ పేరుతో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు రూ.10000 చొప్పున పంపిణీ చేసింది.

అప్ప‌ట్లో రెండు ద‌శ‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఈ నిధుల పంపిణీ జ‌రిగింది. మ‌హిళ‌లు భారీ ఎత్తున క్యూలైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ ఓటేశారు. దీనిని చూసిన వైసీపీ.. ఇంకేముంది.. టీడీపీ మ‌హిళ‌ల‌ను త‌న వైపు తిప్పేసుకుంద‌ని యాగీ చేసింది. తీరా చూస్తే.. ఫలితం వ‌చ్చాక‌.. క్యూలైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ ఓటేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. సో.. అక్క‌డ డ‌బ్బులు ప‌నిచేయ‌లేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా డ‌బ్బులు పంపిణీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం నెల్లూరు సిటీ. కానీ, ఇక్క‌డ కూడా.. ప్ర‌జ‌లు నారాయ‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు.

సో.. ఎలా చూసుకున్నా.. డ‌బ్బుల పంపిణీతో ఓట్లు మార్చ‌డం.. ఓట‌ర్ల అభిప్రాయాల‌ను మార్చ‌డం అనేది.. కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మే త‌ప్ప‌.. నిజం కాద‌ని గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ నిజ‌మైంది. ఇక‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యంలోనూ.. అధికారంలో ఉన్న వైసీపీకి ఎదురు దెబ్బ త‌గిలిన సంద‌ర్భాలు ఉన్నాయి. సో.. డ‌బ్బులు-అధికారం అనేవి ఎన్నిక‌ల‌ను పోలింగ్ ప్ర‌క్రియ‌ను ప్ర‌బావితం చేసే అవ‌కాశం లేదు. ఓట‌రు నాడి ఎలా ఉంటే అలానే ఎన్నిక‌ల పోలింగ్ ఉంటుంది త‌ప్ప‌.. అన‌వ‌స‌ర‌మైన ఆందోళ‌న ప్ర‌తిప‌క్షాల‌కు, అతిశ‌యం వైసీపీకి అవ‌స‌రం లేదు.

Tags:    

Similar News