మార్చి 9.. ఎన్నికల ముహూర్తం.. లోక్ సభకు, ఏపీకీ?
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తమ ప్రయత్నాలను దాదాపు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా ఎన్నికల సంఘం పర్యటనలు చేస్తోంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా సిద్ధమైందా..? ఇప్పటికే రాష్ట్రాల వారీగా పర్యటనలు చేపట్టిన ఎన్నికల సంఘం.. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేసేసిందా..? అంతా ఊహించినట్లే జరిగితే.. ఐదేళ్ల కిందటి కంటే ఈసారి కాస్త తొందరగానే ఎన్నికల షెడ్యూల్ రానుందా? జాతీయ మీడియా కథనాలు ఇదే చెబుతున్నాయి.
దేశం ఈసారి అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటోంది. ప్రతి ఎన్నికా కీలకమైనదే... అయితే, ఈసారి ఇంకా కీలకం. కేంద్రంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ హ్యాట్రిక్ అంటూ ఉరకలేస్తున్నారు. తమకు 370 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇటు చూస్తే ప్రతిపక్షాలు ఇండియా పేరిట కూటమి కట్టి, మోదీని దించేయాలని పట్టుదల చూపుతున్నాయి. ఇటు ఏపీ వంటి కీలక రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి తమదే అధికారం అంటోంది. ఆయన పార్టీ వైసీపీని గట్టిగా ఢీకొట్టాలని టీడీపీ-జనసేన కూటమి భావిస్తోంది. అందుకనే ఈ సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకం. మరోవైపు కేంద్రంలో ఈసారి ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి వివిధ రాష్ట్రాల్లో సమీకరణాలు మారతాయని చెప్పవచ్చు.
ఐదేళ్ల కిందట మార్చి 10న.. ఈసారి 9న?
2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 9న విడుదలైంది. ఈసారి కూడా ఇదే నెలలో రావడం ఖాయమే అని అందరికీ తెలుసు. అయితే, కచ్చితంగా చెప్పకున్నప్పటికీ.. మార్చి 9న షెడ్యూల్ వెలువడుతుందని జాతీయ మీడియా పేర్కొంటోంది. అంటే.. గతం కంటే ఒక్క రోజు ముందు అన్నమాట. ఈ మేరకు
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తమ ప్రయత్నాలను దాదాపు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా ఎన్నికల సంఘం పర్యటనలు చేస్తోంది. ఆయా చోట్ల సన్నాహాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే గత శనివారం ఒడిశా వెళ్లిన ఎన్నికల సంఘం.. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు, రాష్ట్రాల్లోని అధికారులతో సమావేశమైనాకే ఈ మేరకు చెప్పే వీలుంటుంది. అందుకనే.. అధికారులు షెడ్యూల్ దాదాపు ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
9న షెడ్యూల్.. మరి పోలింగ్?
2019లో మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. నాడు ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 7 దశలకు గాను తొలి దశలోనే ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. చివరి దశగా మే 19 వరకు దేశంలో ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా.. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. మరి ఇప్పుడు ఒకరోజు ముందుగా షెడ్యూల్ వస్తున్నది. మరి పోలింగ్, ఫలితాల వెల్లడి.. ఎన్ని దశల్లో ఎన్నికలు జరుగుతాయి? అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈసారి లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు మేలోగా ఎన్నికలు జరగాలి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది.
మార్చి 12-13 తేదీల్లో ఈసీ కశ్మీర్ లో పర్యటించనుంది. లోక్ సభతో పాటే అక్కడి అసెంబ్లీకి ఎన్నికలపై అంచనాకు రానుంది. ఒకవేళ ఇలా అయితే.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెల్లడి మార్చి రెండోవారంలోకి వెళ్తుంది.