ఆ రాజకీయ పార్టీల నెత్తిన సుప్రీం పాలు పోసినట్లేనా?

అవును... ఎలక్టోరల్ బాండ్లపై కోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్స్ పై కోర్టు విచారణ చేపట్టింది.

Update: 2024-08-02 11:02 GMT

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి. ప్రధానంగా ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ.. భారీ ఎత్తున కార్పొరేట్ల నుంచి అక్రమంగా రాజకీయ పార్టీలు విరాళాలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపించాయి.

దీంతో.. ఈ వ్యవహారంపై సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్ధు చేసింది. ఇదే సమయంలో... గత ఏడాదిలో ఈ బాండ్ల ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు అందిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో బయటపెట్టించింది.

ఫలితంగా... ఈ వ్యవహరం ఇక్కడతో సమసిపోయినట్లేననే కామెంట్లు వినిపించాయి. అయితే అలా ఏమీ కాలేదని.. తెరవెనుక జరిగేవి జరిగాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఒకపక్క ఎలక్టోరల్ బాండ్ల పథకం రద్దయినప్పటికీ.. దీన్ని వాడుకుని రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయనే విషయం తెరపైకి వచ్చింది.

దీంతో... ఈ వ్యవహారంపై సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. ఇందులో భాగంగానే సిట్ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. దీంతో... రాజకీయ పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... ఎలక్టోరల్ బాండ్లపై కోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్స్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా... సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నప్పటికీ.. దీనిపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం అనుచితమే అవుతుందని పేర్కొంది.

ఇదే సమయంలో... ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం అనేది కూడా తొందరపాటు చర్యే అవుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదేవిధంగా... ఈ బాండ్ల రూపంలో ఆయా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను రికవరీ చేయడంతోపాటు.. వాటి ఇన్ కం ట్యాక్స్ అసెస్మెంట్స్ ను తిరిగి ఓపెన్ చేయాలంటూ పిటిషనర్లు కోరడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

ఈ విధంగా... ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఉండవచ్చనే ఆరోపణల నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ జరిపించాలంటూ దాఖలైన నాలుగు ప్రజా ప్రయోజన వ్యాఖ్యాలు (పిల్) లను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దీవాలా లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది! దీంతో... ఈ పరిణామం ఆయా రాజకీయ పార్టీల నెత్తిన పాలు పోసినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News