ఈవీ కార్లను రానివ్వడం లేదని.. ఈవీఎంలపై మస్క్ పుల్ల!?
‘టెస్లా కార్’ అంటే.. ఎలక్ట్రిక్ వెహికిల్. అద్భుతమైన డిజైన్ అంతకుమించిన టెక్నాలజీ టెస్లా సొంతం.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే.. రూ.4 లక్షల కోట్లు పెట్టి ట్విటర్ ను కొని.. దాని పేరును ఎక్స్ గా మార్చినా, దీనికిముందు ట్విటర్ ను కొంటానని ఒప్పందం చేసుకుని, నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొర్రీలు పెట్టి, కోర్టు చీవాట్లతో దిగివచ్చినా ఆయనకే సాధ్యం. అసలు మస్క్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఆయన కంపెనీ కార్లు ‘టెస్లా’ గురించి తెలుసుకోవాలి.
సూపర్ కార్..
‘టెస్లా కార్’ అంటే.. ఎలక్ట్రిక్ వెహికిల్. అద్భుతమైన డిజైన్ అంతకుమించిన టెక్నాలజీ టెస్లా సొంతం. దానంతటదే డ్రైవింగే కాదు.. పార్కింగూ చేసుకోగలదు. ఒకటేమిటి..? టెస్లా కార్ గురించి చెబుతూ పోతే అనేక విశేషణాలు. విశిష్టతలు. అయితే, అమెరికాలో అత్యంత డిమాండ్ ఉన్న ఈ కారుకు భారత మార్కెట్ లో మాత్రం ఇంతవరకు ప్రవేశం లేదు.
అతిపెద్ద మార్కెట్ లో కాలుపెట్టాలని..
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో కాలుపెట్టాలని టెస్లా ఎప్పటినుంచో చూస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది. సాక్షాత్తు ఎలాన్ మస్క్ సైతం ఈ విషయమై స్పందించాడు. కానీ, భారత్ లోకి టెస్లా రాక సాధ్యమే కాలేదు. దీనికి కారణం.. మన ప్రభుత్వం నిర్దేశించుకున్న ఒకే ఒక్క నిబంధన.
భారత్ లోనే తయారీ..
టెస్లా కారును భారత్ లోనే తయారు చేసి అమ్మాలనేది భారత ప్రభుత్వం విధించిన నిబంధన. కానీ, మస్క్ మాత్రం విదేశాల్లో తయారు చేసి తీసుకొస్తామని చెబుతున్నారు. దీనికి మన ప్రభుత్వం ససేమిరా అంటోంది. ‘మేకిన్ ఇండియా’ను వదిలేది లేదని స్పష్టం చేస్తోంది. మధ్యలో సంధి ప్రయత్నాలు జరిగినా అవేవీ కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలోనే టెస్లా ఇంకా భారతీయులకు అందుబాటులోకి రాలేదు.
పుల్లలు వేస్తున్నది అందుకే..
తన టెస్లా.. (ఈవీ-ఎలక్ర్టిక్ వెహికిల్స్)ను భారత్ లోకి రానీయకుండా అడ్డుపడుతున్న నిబంధనల పట్ల మస్క్ అసహనంతో ఉన్నట్లున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)ల సమర్థతపై అనుమానాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేశాడు. హ్యాకింగ్ కు వీలుందనే అర్ధంలో మాట్లాడాడు. అసలే భారత్ లో ఈవీఎంలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. గెలిచినవారు ఒకలా, ఓడినవారు మరోలా మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో మస్క్ వ్యాఖ్యలు ఏదో నిగూఢ అర్థంతో చేసినవేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.