ఇదేం కక్కుర్తి కోటగిరి? పుట్టినరోజున ఇలా చేయటమా?

చేతిలో అధికారం ఉన్నప్పుడు అయితే దర్జాగా ఉండాలి. అంతేతప్పించి కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ పనులు అసలే చేయొద్దు.

Update: 2023-10-23 05:19 GMT

చేతిలో అధికారం ఉన్నప్పుడు అయితే దర్జాగా ఉండాలి. అంతేతప్పించి కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ పనులు అసలే చేయొద్దు. కానీ.. తాజా ఎపిసోడ్ లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. పేరు ప్రఖ్యాతులకు కొదవలేని ఆయన.. చిన్న చిన్న విషయంలో ఆయన ప్రదర్శించే వైఖరి వల్ల.. భారీగా చేసింది పక్కకెళ్లి.. ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి మరీ ఇంత కక్కుర్తి ఏంది బాసూ అన్న విమర్శను మూటగట్టేసుకోవటం కనిపిస్తుంది.

ఆదివారం ఏలూరు ఎంపీ కోటగిరి పుట్టినరోజు. అధికార పార్టీ ఎంపీ అయిన వేళ.. ఒక రేంజ్ లో హడావుడి ఉంటుంది. తన బర్త్ డే వేడుకల్ని తన నియోజకవర్గంలో ఎక్కడ నిర్వహించినా అభ్యంతరం ఉండదు. కానీ.. ఏమైందో కానీ ఎంపీగారి మనసు చిన్న తిరుపతి ద్వారకా తిరుమల మీద పడింది. అంతే.. స్వామి వారు కొలువైన కొండ మీద వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. సాధారణంగా మనిషి ఎంత పెద్దోడైనా.. పుణ్యక్షేత్రాలుగా పేరున్న ప్రాంతాల్లో వ్యక్తిగత వేడుకలకు దూరంగా ఉంటారు. దీనికి కారణం.. పుణ్యక్షేత్రానికి ఉండే ప్రత్యేకతగా చెబుతారు. అందుకే.. పుణ్యక్షేత్రాల్లో రాజకీయాల గురించి చాలామంది మాట్లాడటానికి ఆసక్తిని చూపరు.

ఎంపీ బర్త్ డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ జెండాల్ని వాహనాలకు తగిలించుకొని.. పార్టీ గుర్తులున్న టీషర్టులు ధరించి దేవస్థానం కాటేజీల వద్దకు వచ్చారు. ఏలూరు.. గోపాలపురం.. ఉంగుటూరు.. నూజివీడు ఎమ్మెల్యేలు సైతం ఎంపీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఎంపీ కేక్ కట్ చేశారు. దాదాపు పది వేల మంది వరకు కార్యకర్తలు ఎంపీగారి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.

బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని తయారీ కోసం ఆలయ అన్నదాన సిబ్బందితో చేయించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. వడ్డించటమే కాదు.. ఆలయ సిబ్బందితోనే వడ్డన కార్యక్రమాన్ని చేయించారు. అద్దెకు తీసుకోవాల్సిన కల్యాణ మండపాల్ని ఎంపీగారి కోసం ఇచ్చేయటం విమర్శలకు తావిచ్చింది. భారీగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవటాన్ని తప్పు పట్టటం లేదు. కానీ.. పుణ్యక్షేత్రంలో చేసుకోవటం.. స్వామి వారి సేవకు వినియోగించాల్సిన సిబ్బందిని సొంత పనుల కోసం వాడుకోవటం మీదనే అభ్యంతరమంతా. అదేదో.. ఎంపీగారి స్థాయికి తగ్గట్లే.. బయట ఎక్కడైనా వేడుకల్ని నిర్వహించి ఉంటే ఎంత బాగుండేది?

Tags:    

Similar News