ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ సూర్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఉద్యోగి కేఆర్ సూర్యనారాయణపై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఉద్యోగి కేఆర్ సూర్యనారాయణపై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాపారులతో సూర్యనారాయణ చేతులుకలిపి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల మేర గండి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. జీఎస్టీ వసూళ్ళు, ఎగొట్టడం వంటి వ్యవహారాలలో సూర్య నారాయణ చాలామంది వ్యాపారస్తులతో కుమ్మకైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, విజయవాడ పడమట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కొందరు వ్యాపారులు ముందుకు వచ్చి సూర్యనారాయణపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సూర్యనారాయణను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను రిమాండులో ఉంచారు.
అయితే, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో సూర్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా చుక్కెదురైంది. సూర్యనారాయణ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. సూర్యనారాయణపై తీవ్రమైన ఆరోపణలున్నాయని, అందుకే బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో సూర్యనారాయణకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని, వ్యాపారుల ,సహ నిందితుల, సాక్షుల వాంగ్మూలాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు కూడా సూర్యనారాయణ పాత్రను ప్రాథమికంగా నిర్ధారిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ నిరాకరించారు. అంతేకాదు, ఈ కేసులో సూర్యనారాయన పాత్రపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తి కాలేదని, ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో, బెయిల్ వస్తుందని ఆశించిన సూర్యనారాయణకు భంగపాటు తప్పలేదు.
యూనియన్ నేత హోదాలో ప్రభుత్వంతో ఉద్యోగుల సమస్యలపై చర్చల్లో సూర్యనారాయణ రెగ్యులర్ గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రులతో జరిగిన అనేక చర్చల్లో సూర్యానారాయణ తరచూ కనబడుతుంటారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసహనాన్ని సూర్యనారాయణ బాహాటంగా వెళ్లగక్కేవారని విమర్శలున్నాయి.