భారతీయులకు బ్యాడ్ న్యూస్ గా మారనున్న బ్రిటన్ తాజా బిల్లు
ఉపాధి కోసం బ్రిటన్ కు వెళ్లాలని ఆశించే వారికి.. వారితో పాటు ఆ దేశానికి వెళ్లాలనుకునే కుటుంబ సభ్యులకు పెద్ద బ్యాడ్ న్యూస్
ఉపాధి కోసం బ్రిటన్ కు వెళ్లాలని ఆశించే వారికి.. వారితో పాటు ఆ దేశానికి వెళ్లాలనుకునే కుటుంబ సభ్యులకు పెద్ద బ్యాడ్ న్యూస్. బ్రిటన్ లో పెరుగుతున్న వలసల్ని అడ్డుకునేందుకు వీలుగా.. ఆ దేశంలో ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని ఆ దేశం భావిస్తోంది. దీనికి సంబంధించి కీలక బిల్లును తాజాగా అక్కడి చట్టసభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..భారతీయ నిపుణుల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించేలా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక నుంచి అత్యధిక వేతనాలు ఉన్న విదేశీ వ్రత్తి నిపుణులకే వీసాలు ఇవ్వాలని.. అలా వచ్చే వారి డిపెండెంట్లుగా వచ్చే భాగస్వామ్యులకు కఠిన నిబంధనల్ని అమలు చేయాలని బ్రిటన్ భావిస్తోంది. సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశ పెట్టిన బిల్లుకు ఆమోదముద్ర పడితే మాత్రం భారతీయులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఈ బిల్లు కారణంగా ఆరోగ్య రంగంలో పని చేయటానికి వచ్చే నిపుణులు తమ కుటుంబ సభ్యుల్ని బ్రిటన్ కు తీసుకొచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
తాజాగా ప్రవేశ పెట్టిన బిల్లులో పొందుపర్చిన కఠిన నిబంధనల కారణంగా ప్రస్తుత వలసల్లో 3 లక్షల మంది వరకు తగ్గే వీలుందని చెబుతున్నారు. ఇప్పటివరకు వ్రత్తి నిపుణుల వీసా పొందటానికి వార్షిక వేతనం 26,200పౌండ్లు (మన రూపాయిల్లో సుమారు 27.6లక్షలు) ఉంటే సరిపోయేది. తాజాగా ప్రవేశ పెట్టిన బిల్లు ప్రకారం 38,700 (మన రూపాయిల్లో రూ.40.7 లక్షలు)ఉండాలి. గతంలో కుటుంబ వీసా కోసం 18వేల పౌండ్లు ఉండే సరిపోయేది. దాన్ని ఇప్పుడు 38,700 పౌండ్లకు పెంచటం వల్ల ఒక మోస్తరు జీతాలు ఉన్న వారు తమ కుటుంబ సభ్యుల్ని బ్రిటన్ కు తీసుకురావటం అసాధ్యం. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో స్టూడెంట్ వీసాల మీదా ఆంక్షలు అమలు చేసే వీలుందని చెబుతున్నారు. వీలైనంత వరకు వలసల్ని ఫిల్టర్ చేయాలన్నదే బ్రిటన్ ఆలోచనగా చెప్పాలి.