ఈటల మాట చెల్లడం లేదా?

దీంతో క్రిష్ణ యాదవ్ ను పార్టీలో చేర్పించాలన్న ఈటల ప్రయత్నానికి బ్రేక్ పడింది.

Update: 2023-09-08 16:30 GMT

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. బీజేపీలో చేరి.. ఉప ఎన్నికల్లో విజయంతో సత్తా చాటిన ఈటల రాజేందర్ కు ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత లేదా? బీజేపీలో ఆయన మాట చెల్లడం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను తీసుకొచ్చిన నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంలో ఇబ్బందులు రావడం, తాను హామీ ఇచ్చిన నేతలను పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం ఈటలకు మింగుడు పడడం లేదని తెలిసింది.

మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్ ను బీజేపీలో చేర్పించేందుకు ఈటల గట్టిగానే ప్రయత్నించారు. ఈ మేరకు క్రిష్ణ యాదవ్ ను ఒప్పించారు. పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా పెట్టారు. కానీ పార్టీలో చేర్చుకునే రోజే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అడ్డం పడ్డారని తెలిసింది.

తన నియోజకవర్గంలో తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా క్రిష్ణ యాదవ్ ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని కిషన్ రెడ్డి ప్రశ్నించారని సమాచారం. దీంతో క్రిష్ణ యాదవ్ ను పార్టీలో చేర్పించాలన్న ఈటల ప్రయత్నానికి బ్రేక్ పడింది.

ఇక వేములవాడ టికెట్ వచ్చేలా చూస్తాననే హామీని ఇచ్చి తుల ఉమను బీజేపీలోకి ఈటల తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ తనయుడు వికాస్ రావును కిషన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వేములవాడ టికెట్ వికాస్ రావుకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఉమకు తానిచ్చిన హామీ ఎలా? అనే సందిగ్ధంలో ఈటల ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు బట్టి చూస్తే బీజేపీలో ఈటల రాజేందర్కు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, ఆయన మాట చెల్లడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేరికల కమిటీ ఛైర్మన్గా ఈటల చేసిందేమీ లేదని బీజేపీ అధిష్ఠానం భావిస్తుందనే టాక్ కూడా ఉంది.

Tags:    

Similar News