రేవంత్ పై ఎదురుదాడిని షురూ చేసిన ఈటల
నడమంత్రపు సిరిలా రేవంత్ కు సీఎం పదవి వచ్చిందన్న ఈటల.. ‘రేవంత్ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినాయకత్వం ఒక్కటే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. డైలీ బేసిస్ లో సీఎం రేవంత్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వం కొలువు తీరిన వారం వ్యవధిలోనే ఆరోపణలు మొదలు పెట్టిన గులాబీ అధినాయకత్వానికి తోడయ్యారు బీజేపీ నేతలు. ఇప్పటివరకు లేని విధంగా తాజాగా మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ గళం విప్పారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు.
నడమంత్రపు సిరిలా రేవంత్ కు సీఎం పదవి వచ్చిందన్న ఈటల.. ‘రేవంత్ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఖబడ్డార్. నోరు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. వ్యాపారస్తులను బ్లాక్ మొయిల్ చేస్తున్న వసూళ్ల చిట్టా రికార్డు అవుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగుడుతూనే.. మరోవైపు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
గతంలోనూ కేసీఆర్ సైతం ఇదే తరహాలో మాట్లాడారని.. ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు ఈటల రాజేందర్. అధికారం చేతిలో ఉందని.. ఏది పడితే అది మాట్లాడితే సహించటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ‘‘కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని రేవంత్ విమర్శిస్తున్నారు. కానీ.. రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబడ్డార్. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు’’ అని మండిపడ్డారు.
రాహుల్ గాంధీకి నిధులు పంపటానికి ఇక్కడున్న వ్యాపారస్తుల్ని ఎంత వేధిస్తున్నది.. ఎంత బ్లాక్ మొయిల్ చేస్తున్నది తాము రికార్డు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న నువ్వే అంతా నేనే అని రేవంత్ అనుకుంటున్నారని.. ఆయన్ను కూడా చూసే వారు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మల్కాజ్ గిరిలో ఎవరొచ్చినా.. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గెలిచేది బీజేపీనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ మీద ఈ తరహా ఆరోపణలు చేసిన మొదటి నేతగా ఈటలను చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.