హార్డ్ కోర్ తమ్ముళ్లు సైతం ఓడాలని ప్రార్థిస్తే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే
అందరిది ఒక దారి అయితే.. పయ్యావుల పరిస్థితి మరోలాంటిది. ఆయనకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదు కూడా.
మీరు చదివిన దాన్లో ఎలాంటి తప్పు లేదు. నిజానికి ఈ గెలుపు తెలుగు తమ్ముళ్లలో అంతులేని ఆనందాన్ని కలుగజేసింది. ఓడిపోవాలి సామీ అని అనుకున్న సొంత పార్టీ నేతలు.. సదరుఅభ్యర్థి గెలిచిన తర్వాత.. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న సెంటిమెంట్ కు బ్రేక్ పడిందని సంతసించిన పరిస్థితి. ఇంతకూ ఇలాంటి విచిత్రమైన సీన్ ఎక్కడ చోటు చేసుకుంది? కరడుకట్టిన తెలుగుదేశం అభిమాని సైతం ఓడిపోవాలనుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరంటే పయ్యావుల కేశవ్. అందరిది ఒక దారి అయితే.. పయ్యావుల పరిస్థితి మరోలాంటిది. ఆయనకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదు కూడా.
పార్టీ పట్ల పయ్యావుల కమిట్ మెంట్ ను క్వశ్చన్ చేయలేనిది. కంచు కంఠం.. ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు.. ఆయన క్వశ్చన్ చేసే వైనం అందరిని ఆకట్టుకునేలా చేస్తాయి. తెలుగుదేశం పార్టీలో సబ్జెక్టు మాట్లాడే అతి కొద్ది మంది నేతల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. అలాంటి ఆయన్ను ఎన్నికల్లో ఓడిపోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన వారంతా కోరుకున్నారు. ఆ మాటకు వస్తే దేవుడికి ప్రార్థనలు చేశారు.
అయితే.. విధి చాలా విచిత్రమైనది. ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్న సెంటిమెంట్ కారణంగా తన పొలిటికల్ కెరీర్ లో తీవ్రంగా నష్టపోయిన పయ్యావుల కేశవ్ కు ఎట్టకేకలకు శాపవిమోచనం జరిగినట్లుగా తాజా ఫలితం చోటు చేసుకుంది. ఉరవకొండలో అందునా పయ్యావుల కేశవ్ గెలిస్తే.. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని.. అధికారం చేజారుతుందంటూ ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ఈ కారణంగా తెలుగుదేశాన్ని అమితంగా ఆరాధించే వారు మొదలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు పయ్యావుల కేశవ్ మాత్రం ఎన్నికల్లో ఓడిపోవాలని ప్రార్థిస్తుంటారు. దీనికి కారణం ఒక సీటు పోయినా.. పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశ ఉండేది.
ఈ సెంటిమెంట్ విషయంలో తానేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేవారు కేశవ్. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోయి ఉండటం కారణంగా.. సరైన అవకాశం ఇప్పటివరకు దక్కలేదు. తాజా ఎన్నికల ఫలితం పుణ్యమా అని.. ఇంతకాలం నడిచిన నమ్మకం సడలిపోయింది. ఆయనపై ఉన్న శాపం తొలిగిపోయింది. ఇంతకాలం పయ్యావుల కేశవ్ గెలిస్తే పార్టీ ఓడిపోవటం.. ఆయన ఓడితే పార్టీ గెలవటం ఒక రివాజుగా మారింది. దీంతో.. పార్టీ గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పయ్యావుల కేశవ్ ఓడిపోవాలంటూ హార్డ్ కోర్ తెలుగుదేశం అభిమానులు సైతం దేవుడికి దండాలు పెట్టేవారు.
ఇదంతా వినేందుకు.. చదివేందుకు బాగానే ఉన్నా.. దాన్ని అనుభవించే వారి మానసిక పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు మాత్రం అయ్యో అనుకోకుండా ఉండలేం. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉండి శాపగ్రస్త జీవితాన్ని ఆయన అనుభవించారు. మంత్రి పదవి కూడా దక్కింది లేదు. అలాంటిది ఈసారి మాత్రం ఆయనకున్న శాపం తొలిగిపోయింది. ఆయన గెలిచారు. పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. తెలుగుదేశం అభిమానులంతా ఎంతో ఆనందానికి గురయ్యారు. ఎందుకుంటే..ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ పార్టీని వీడిపోకుండా.. నిస్వార్థంగా పోరాడిన పయ్యావుల కేశవ్ కు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయన్న మాట వినిపిస్తోంది. మరి.. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.