టీడీపీకి దగ్గరయేందుకు మాజీ మంత్రి ప్రయత్నాలు

వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న ఆ మాజీ మంత్రి టీడీపీలో చేరబోతున్నారా?

Update: 2023-10-15 18:56 GMT

వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న ఆ మాజీ మంత్రి టీడీపీలో చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆ మాజీ మంత్రి ఎవరో కాదు కొత్తపల్లి సుబ్బారాయుడు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ఈ మాజీ మంత్రి ఎక్కువగా కనిపించడంతో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీకి దగ్గరయేందుకు సుబ్బారాయుడు చూస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టులో సుబ్బారాయుడు కనిపించడం పలు సందేహాలకు తావిస్తోంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో లోకేష్ ఎక్కువగా ఢిల్లీలో ఉంటున్నారు. సుప్రీం కోర్టులో కేసులు, అక్కడి జాతీయ మీడియాతో చర్చలు తదితర కారణాలతో ఢిల్లీలో లోకేష్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ తో పాటు సుబ్బారాయుడు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సుబ్బారాయుడు మళ్లీ టీడీపీలోకి వస్తారనే ప్రచారం జోరందుకుంది. కానీ దీనిపై ఇంకా సుబ్బారాయుడు అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుబ్బారాయుడు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సుబ్బారాయుడు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ నరసాపురం నుంచి ఇప్పటికే టికెట్ రేసులో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఆయన ముందడుగు వేసేందుకు సందేహిస్తున్నారని సమాచారం. నరసాపురం నుంచి టీడీపీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, పార్టీ ఇంఛార్జీ పొత్తూరు రామరాజులు ఆశిస్తున్నారు. ఇప్పుడు సుబ్బారాయుడు కూడా వస్తే ముక్కోణపు పోరు తప్పదనే చెప్పాలి.అందుకే ముందుగా ఈ కష్ట కాలంలో లోకేష్ కు దగ్గరగా ఉంటూ.. సాన్నిహిత్యం పెంచుకున్న తర్వాత టీడీపీలోకి చేరాలనేది సుబ్బారాయుడు ఆలోచన కావొచ్చన్నది విశ్లేషకుల మాట.

Tags:    

Similar News