చేర్చుకుంటామని మొహం చాటేసిన బీజేపీ.. మాజీ మంత్రికి ఘోర అవమానం!?
ఆయన 30 ఏళ్ల కిందటే ఉమ్మడి ఏపీలో పేరున్న నాయకుడు.. 20 ఏళ్ల కిందటే ఉమ్మడి ఏపీలో కీలక మంత్రి.. కానీ, అనుకోని కేసులో ఇరుక్కున్నారు.
ఆయన 30 ఏళ్ల కిందటే ఉమ్మడి ఏపీలో పేరున్న నాయకుడు.. 20 ఏళ్ల కిందటే ఉమ్మడి ఏపీలో కీలక మంత్రి.. కానీ, అనుకోని కేసులో ఇరుక్కున్నారు. మంత్ర్రి పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత జైలు పాలయ్యారు. రాజకీయంగానూ తెరమరుగయ్యారు. అనంతరం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. బీసీ సామాజిక వర్గం.. అందులోనూ తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న యాదవ వర్గానికి చెందిన ఆయన పరిస్థితి ప్రస్తుతం డోలాయమానంగా ఉంది. అయితే, దీనికంటే తాజాగా ఎదుర్కొన్న అవమానమే అత్యంత తీవ్రమైనదిగా చెప్పాల్సి ఉంటుంది.
బీజేపీ.. ఇదే సంప్రదాయం?
హిందూ సంప్రదాయాలను అత్యంత గౌరవించే పార్టీగా బీజేపీని చెబుతుంటారు. హిందూ ధర్మం కోసం పాటుపడే పార్టీగానూ ఆ నాయకులు గొప్పలు పోతుంటారు. హిందూ మతం అనేది మతం కాదని జీవన విధానమని పేర్కొంటుంటారు. అసలు హిందూ సంప్రదాయాల్లో అతిథిని గౌరవించడం అనేది అత్యంత ముఖ్యం. అంటే ఇంటికి వచ్చినవారిని మంచిగా చూసుకోవడం. కానీ, బీజేపీ తెలంగాణ నాయకులు తాజాగా చేసిన మాత్రం అందరినీ కలచివేసే అంశం.
క్రిష్ణ.. క్రిష్ణ
హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్ ది అంబర్ పేట నియోజకవర్గం. టీడీపీ తరఫున ఇక్కడినుంచి గెలిచిన ఆయన ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. అయితే, 2003లో స్టాంపుల కుంభకోణంలో ఆయన పేరు రావడంతో పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి కూడా బహిష్కరణకు గురయ్యారు. అప్పటినుంచే క్రిష్ణ యాదవ్ కు రాజకీయంగా గడ్డుకాలం దాపురించింది.
టీడీపీలో చేరినా.. బీఆర్ఎస్ లోకి వెళ్లినా
స్టాంపుల కుంభకోణంలో జైలు నుంచి విడుదలైన అనంతరం క్రిష్ణా యాదవ్ తిరిగి టీడీపీలో చేరారు. అనంతరం బీఆర్ఎస్ లోకి వెళ్లారు. పోటీ చేసేందుకు మాత్రం ఆయనకు అవకాశం దక్కలేదు. తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయగా.. తీవ్ర అవమానం ఎదుర్కొన్నారు.
రమ్మని పిలిచి.. ఇలా చేస్తారా?
క్రిష్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరాల్సి ఉంది. ఇందుకోసం ఆయన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. వందలాది మంది అనుచరులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం దగ్గర్లోని ఓ ఫంక్షన్ హాల్ కు చేరుకున్న ఆయన బీజేపీ నేతల నుంచి ఆహ్వానం కోసం ఎదురుచూశారు. కానీ, దాదాపు మూడు గంటల వరకు వేచి చూసినా ఎవరూ పిలవలేదు. చివరకు ఆయన చేరిక వాయిదా పడింది.
పోటీకి వస్తారనా?
క్రిష్ణ యాదవ్ సొంత నియోజకవర్గం అంబర్ పేట. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడినుంచి రెండుసార్లు నెగ్గారు. 2018లో ఓడిన ఆయన ఈసారి మళ్లీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అంబదుకనే క్రిష్ణా యాదవ్ చేరికకు అడ్డంకులు కలుగుతున్నట్లుగా స్పష్టమవుతోంది. వాస్తవానికి క్రిష్ణా యాదవ్ ను బీజేపీలోకి బీసీ నేతలు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగించినట్లుగా సమాచారం. కానీ పార్టీలోని అగ్రనేతల మధ్య అభిప్రాయ బేధాలు దీనికి అడ్డుపడ్డాయి. ఏదేమైనా.. ఓ బీసీ నేత విషయంలో బీజేపీ ఇలా చేయడం అవమానించడమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.