నెల్లూరుపై మాజీ మంత్రి మార్క్ రాజకీయం... ఇన్ని ట్విస్టులా...!
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్నాళ్లుగా రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. గత 2019 ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి రాం రాం చెప్పారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్నాళ్లుగా రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. గత 2019 ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి రాం రాం చెప్పారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లు పార్టీకి దూరమయ్యారు. సీఎం జగన్‌పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక, పార్టీలో దూకుడుగా ఉన్న కొందరు నాయకులు కూడా ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.
ఇలాంటి సమయంలో వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? గత 2019 ఎన్నికల్లో సాధించిన రికార్డు తిరిగి రిపీట్ అవుతుందా? లేదా? అనే బెంగ పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. అయితే..ఈ చర్చకు తెర దించుతూ.. తాజాగా మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటున్నట్టు తెలిపారు.
గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను ఏ విధంగా అయితే.. వైసీపీ దక్కించుకుందో అలానే 2024 ఎన్నికల్లోనూ విజయందక్కించుకునేదిశగా అనిల్ కార్యాచరణకు రెడీ అయ్యారు. తాజాగా ఆయన కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి.. మహీధర్ రెడ్డిలతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారితో చర్చించినట్టు తెలిసింది.
జిల్లాలో వచ్చే మూడు మాసాల్లో వైసీపీని పరుగులు పెట్టించేవ్యూహానికి పదును పెట్టినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నెల్లూరులోని పది స్థానాలనూ గెలుచుకునేలా వ్యూహంసిద్ధం చేసుకుందామని వారికి అనిల్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో మాధురిగానే.. పది అసెంబ్లీ.. రెండు లోక్ సభ స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని, ఇది పక్కా అనికూడా వారికి తేల్చి చెప్పారని సమాచారం.
నేతల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను సరిచేసేందుకు తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తానని అనిల్ చెప్పినట్టు సమాచారం. మొత్తానికి నెల్లూరు వైసీపీ దూకుడు పెరుగుతున్నట్టు సంకేతాలు అయితే వస్తున్నాయి.