మాజీ మంత్రుల పేషీలపై నిఘా ?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Update: 2023-12-07 06:02 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా పేషీలను ఖాళీ చేస్తున్నారు. వీళ్ళు పేషీలను ఖాళీచేస్తే కానీ కొత్త మంత్రులకు పేషీలుండవు. అయితే మాజీమంత్రుల పేషీలు ఖాళీ చేస్తున్న సందర్భంగా శాఖలకు సంబంధించిన ఫైళ్ళేవీ బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పేషీలు ఖాళీ చేసేటపుడు కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు బయటకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయి.

అందుకనే పేషీలో పనిచేసిన సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత వస్తువులు తప్ప శాఖాపరమైన ఫైళ్ళేవీ బయటకు వెళ్ళకుండా చూడాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నుండి ఆదేశాలు అందినట్లు తెలిసింది. దాంతో సచివాలయం సెక్యూరిటి బాధ్యతలు చూస్తున్న ఉన్నతాదికారులు వెంటనే రంగంలోకి దిగి ప్రతి మంత్రి పేషీలోని సిబ్బందిపైనా నిఘా ఉంచినట్లు సమాచారం. మాజీమంత్రులకు పీఎస్, పీఏ, ఓఎస్డీలుగా పనిచేసిన సిబ్బంది కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం.

కేసీయార్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీయార్ హయాంలో అవినీతి ఆకాశానికి పాకిపోయిందని చాలాసార్లు ఆరోపించారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ, హోంశాఖతో పాటు సంక్షేమ, మున్సిపాలిటి, పంచాయితీ రాజ్ శాఖలపైన కాంగ్రెస్ చాలా ఆరోపణలు చేసింది. కాబట్టి ఇపుడు సెక్యూరిటి అధికారుల దృష్టి కూడా పై శాఖల్లోని పేషీ సిబ్బందిపైనే ఎక్కువగా ఉందట. రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాఖల్లో ముఖ్యమైన ఫైళ్ళు మాయమైపోయాయంటే అందుకు ముందుగా శాఖల ముఖ్య కార్యదర్శులు, తర్వాత చీఫ్ సెక్రటరీయే బాధ్యత వహించాలి.

పనిలోపనిగా వివిధ శాఖల్లో ఇంతకాలం ఉపయోగించిన పెన్ డ్రైవ్ లు, కంప్యూటర్లతో పాటు ఇతర డిజిటల్ ఎక్విప్మెంట్ ను స్వాధీనం చేసుకోమని చీఫ్ సెక్రటరీ జీఏడీ ఉన్నతాధికారులను ఆదేశించారట. పేషీలు ఖాళీలు చేసేటపుడు జీఏడీ అధికారులు దగ్గరుండి ఇన్వెంటరీ రాసుకుని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసి మరీ అనుమతిస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని కీలకమైన ఫైళ్ళు కొన్ని శాఖల్లో మాయమయ్యాయనే ప్రచారం మొదలైంది. మరి దీనిపై కొత్తప్రభుత్వం ఎలా రియాక్టవుతుందో చూడాలి.

Tags:    

Similar News