ఇలాంటి ఫోన్ కాల్ వస్తే అస్సలు టెన్షన్ వద్దు.. ఏం చేయాలంటే?
ఎక్కువమంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఆ అంశాన్ని పట్టుకొని కొత్త తరహాలో బెదిరింపులకు దిగుతున్నారు.
చేతికి స్మార్టు ఫోన్ వచ్చి.. అందులో యావత్ ప్రపంచం మొత్తం ఇమిడిపోయిన వేళ.. మంచితో పాటు చెడు కూడా అంతే వేగంగా వచ్చి చేరింది. సైబర్ బందిపోట్లు దోచుకోవటమే లక్ష్యంగా ఆన్ లైన్ లో దోచేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. సమయానికి తగ్గట్లు.. ట్రెండింగ్ లో ఉన్న అంశాల్ని పట్టుకొని.. వాటితో అమాయకుల్ని ఆర్థికంగా దివాళ తీయిస్తున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతాల్లో ఎలా రియాక్టు కావాలన్నది ముఖ్యం. తాజాగా కొత్త ఎత్తుగడకు తెర తీసిన సైబర్ బందిపోట్లు.. సామాన్యుల్ని భయంతో వణికించేలా చేస్తున్నారు.
ఎక్కువమంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఆ అంశాన్ని పట్టుకొని కొత్త తరహాలో బెదిరింపులకు దిగుతున్నారు. ఫోన్ లో ఏమేం చూస్తున్నారో తమకు తెలుసని.. ఛైల్డ్ పో*ర్నోగ్రఫీ నాన్ బెయిలబుల్ నేరమని.. తమ వద్ద అలాంటి సమాచారం ఉందని.. అశ్లీల వెబ్ సైట్లను పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారన్న విషయాన్ని చెప్పేస్తూ.. భయాందోళనలకు గురి చేసి.. ఆ మాయలో డబ్బులు దోచేస్తున్న వైనం ఇప్పుడు ఎక్కువైంది.
ఈ సైబర్ బందిపోట్లు తమను తాము ఢిల్లీ.. ముంబయి సైబర్ క్రైం పోలీసులుగా పరిచయం చేసుకుంటున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్.. స్టేట్ సైబర్ సెల్.. ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ కొత్త కొత్త పేర్లను.. గంభీరంగా ఉండే సంస్థలను పోల్చి ఉండేలా పేర్లు చెప్పి భయాందోళనలకు గురి చేస్తారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నారని పేర్కొంటూ అందుకు తీసుకోవాల్సిన చర్యల్ని అదే పనిగా చెబుతారు.
తమ విచారణలో అన్ని విషయాలు బయటపడ్డాయని.. మీ సిస్టం ఐపీ అడ్రస్ కూడా తమ వద్ద ఉందంటూ మైండ్ గేమ్ ఆడతారు. దీంతో.. ఒక్కసారిగా బిక్కచచ్చిన పోయిన బాధితుడు సైబర్ బందిపోట్లు అడిగినంత డబ్బుల్ని ఇవ్వటం మొదలుపెడతారు. ఇలాంటి ఫోన్ కాల్స్ మీకు వస్తే.. ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దు. మిమ్మల్ని ట్రాప్ చేయటానికే ఇదంతా అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. వారెంత బెదిరిస్తున్నా.. భయపెట్టే మాటల్ని చెప్పిన పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
వారితో ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాల్ కట్ చేసి.. నెంబరు బ్లాక్ చేయాలి. ఈ క్రమంలో కాల్ కట్ చేస్తే.. పరిణామాలు సీరియస్ గా ఉంటయన్న హెచ్చరిక ధోరణికి తెర తీస్తారు. అయినప్పటికీ ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. కాల్ కట్ చేస్తే సరిపోతుంది. మళ్లీ.. మళ్లీ ఫోన్ చేస్తే.. తాను ఫలానా ఫోలీస్ స్టేషన్ ఉన్నామని బాధితుడు చెప్పటం ద్వారా వారిని వదిలించుకునే వీలుంది. అంతేకాదు.. అదే పనిగా ఫోన్ చేసి వేధిస్తున్న వారిపై దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చే మరింత బాగుంటుందన్నమాట. ఈ విషయాల్ని అస్సలు మర్చిపోవద్దు. చిక్కుల్లో పడొద్దు.