ఆయన మాట విని.. 'సునీత' తొందరపడ్డారా..!
కట్ చేస్తే.. రాజీనామా చేసి పది రోజులు అయినా.. ఇప్పటి వరకు తన సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
వదులు కోవడం తేలిక.. పట్టుకోవడం కష్టం.. ఇదే ఇప్పుడు సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ పోతుల సునీత విషయంలో జరుగుతోంది. ఆమె ఆయారాం.. గయారాం.. బ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఎప్పు డు ఏ పార్టీలో ఉంటారనే విషయంలో ఆమెకే స్పష్టత లేదు. అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు చూపుతారు. గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే.. ఎమ్మెల్సీ ఇచ్చిన చంద్రబాబును వదిలేసి ఈ పార్టీకి జై కొట్టారు.
తర్వాత.. వైసీపీలో మహిళా నాయకురాలిగా చలాయించారు. మంత్రి పదవిని ఆశించిన మాట వాస్తవం. అయితే.. జిల్లా స్థాయి నాయకులు ఆమెను అడ్డుకున్నారన్నది అప్పట్లో చర్చ సాగింది. దీంతో కొన్నాళ్లు అలిగినా.. మళ్లీ సాధారణ స్థితికి వచ్చారు. ఆ తర్వాత.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఇది కూడా దక్కలేదు. ఈ అసంతృప్తితోనే.. ఇటీవల రాజీనామా చేశారు. అయితే.. దీనికి ముందు పెద్ద కథే నడించిందని ఇప్పుడు తెలుస్తోంది.
టీడీపీలోని ఓ మాజీ మంత్రి సూచనలతోనే ఆమె వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి ఉన్నట్టుండి రాజీనామా చేశా రని అంటున్నారు. ''నేనున్నా.. నువ్వు రాజీనామా చెయ్యి. వెంటనే చంద్రబాబు అప్పాయింట్మెంటు ఇప్పిస్తా''నని సదరు నాయకుడు చెప్పారట. దీంతో ముందు, వెనుక కూడా ఆలోచించకుండానే సునీత తన పదవి వదులుకున్నారు. కట్ చేస్తే.. రాజీనామా చేసి పది రోజులు అయినా.. ఇప్పటి వరకు తన సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇదే విషయాన్ని సునీత తన అనుచరుల దగ్గర చెప్పుకొని వాపోయారని తెలిసింది. చిత్రం ఏంటంటే.. ఆ మాజీ మంత్రి ఇప్పుడు.. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. పైగా.. చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని.. వేరే మార్గం ఉంటే ఆలోచించుకోవాలని మరికొందరు చెబుతున్నట్టు సునీత అనుచరులు చెబుతున్నారు. సునీత వంటి నాయకులను చేర్చుకునేందుకు చంద్రబాబు రెడీగా లేరని మరికొందరు కుండబద్దలు కొడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు సునీత పరిస్థితి అడకత్తెరగా మారింది.