భారత్ లో ఎగిరే ట్యాక్సీలు.. 2026 నాటికి!
ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, కొత్త రహదారులను ప్రభుత్వం నిర్మిస్తూనే ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఎన్ని చర్యలు తీసుకున్నా తగ్గడం లేదు. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఇక మన దేశంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందనే చెప్పాలి. ముంబయి, కోల్ కతా, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య జనాలను వేధిస్తూనే ఉంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, కొత్త రహదారులను ప్రభుత్వం నిర్మిస్తూనే ఉన్నాయి.
కానీ సొంత వాహనాలపై జనాల మోజు పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య తగ్గడం లేదు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్న వాళ్లయితే హాయిగా గాల్లో తేలే కార్లు ఉంటే ఎంత బాగుండునో ఎగిరి వెళ్లిపోయేవాళ్లం అని ఎన్నోసార్లు అనుకునే ఉంటారు. ఇప్పుడు అలాగే గాల్లో ఎగురుతూ జనాలు వెళ్లే రోజులు మరెంతో దూరంలో లేవనే చెప్పాలి.
భారత్ లో త్వరలోనే ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. అవును.. త్వరలోనే ఇక ఎంచక్కా గాలిలో ఎగురుతూ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. 2026 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని ఇంటర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకుంటే 10 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని చేరుకోవడానికి గంట పడుతుంది. కానీ 60 నుంచి 90 నిమిషాల ప్రయాణాన్ని ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చు. ఇప్పుడీ ఎయిర్ ట్యాక్సీలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా? అని చూసేవాళ్ల సంఖ్య ఎక్కువే. ఈ ఎగిరే ట్యాక్సీలు ఎలా ఉంటాయి? దీంట్లో ప్రయాణ ఖర్చు ఎంత ఉంటుంది? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.