బలమైన కరెన్సీల్లో మన రూపాయి ర్యాంక్ ఎక్కడంటే..?
ఇదే సమయంలో వాటి ప్రాముఖ్యతకు దోహదం చేసిన కారణాలనూ వివరించింది.
ప్రపంచంలో ఒక్కో దేశానికీ ఒక్కో కరెన్సీ ఉంటుందనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులపై వాటి వాటి కరెన్సీ విలువ ప్రపంచ మార్కెట్ లో మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇదే సమయంలో వాటి ప్రాముఖ్యతకు దోహదం చేసిన కారణాలనూ వివరించింది.
అవును... ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో కువైటీ "దినార్" తొలి స్థానంలో ఉంది. ఈ ఒక్క దినార్ విలువ భారత కరెన్సీలో రూ.270.23 లకు, అమెరికా కరెన్సీలో 3.25 డాలర్లకు సమానం. ఈ జాబితాలో రెండో స్థానంలో బహ్రెయినీ "దినార్" ఉంది. ఒక్క బహ్రెయినీ దినార్ 220.4 రూపాయలతోనూ 2.65 డాలర్లతోనూ సమానం.
1960లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కువైటీ దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా కొనసాగుతుండగా... చమురు నిక్షేపాలు, పన్ను రహిత వ్యవస్థతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగడమే దీనికి కారణం అని వెల్లడించింది. ఇదే సమయంలో ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి విస్తృతంగా వినియోగిస్తున్న కరెన్సీ అయిన అమెరికా డాలర్ పదో స్థానంలో ఉండడం గమనార్హం.
అదేవిధంగా... ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీ స్విస్ ఫ్రాంక్ అని ఫోర్బ్స్ తెలిపింది. ఇక ఈ జాబితాలో భారత కరెన్సీ రూపాయి 15వ స్థానంలో ఉంది. సుమారు 82.9 రూపాయలు ఒక డాలర్ తో సమానం. ఈ సమయంలో... ఈ జాబితా ప్రకారం టాప్ 10 బలమైన కరెన్సీ... రూపాయల్లో వాటి విలువ ఇప్పుడు చూద్దాం...!
కువైటీ దినార్ (రూ.270.23)
బహ్రెయినీ దినార్ (రూ.220.4)
ఒమన్ రియాల్ (రూ.215.84)
జోర్డాన్ దినార్ (రూ.117.10)
జిబ్రాల్టర్ పౌండ్ (రూ.105.52)
బ్రిటిష్ పౌండ్ (రూ.105.54)
కేమన్ దీవుల డాలర్ (రూ.99.76)
స్విస్ ఫ్రాంక్ (రూ.97.54)
యూరో (రూ.90.80)
డాలర్ (రూ.82.9)