అట్లాస్ సైకిల్ కంపెనీ మాజీ ప్రెసిడెంట్ సూసైడ్
దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆయన పిస్టల్ తో కాల్చుకొని మరణించిన విషయాన్ని గుర్తించారు.
సైకిల్ తో గురుతులు ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు అట్లాస్ సైకిల్ కంపెనీ. ఇప్పటి జనరేషన్ పిల్లలకు పరిచయం కాదేమో కానీ.. తొంభైల వరకు కూడా సైకిళ్ల హవా నడిచింది. ఆ మాటకు వస్తే.. ఇప్పుడు ఉన్నా.. గతంతో పోలిస్తే బాగా తగ్గిందని చెప్పాలి. అప్పట్లో ఫేమస్ సైకిల్ కంపెనీల జాబితాలో అట్లాస్ సైకిల్ కంపెనీ ఒకటి. తాజాగా ఆ కంపెనీ మాజీ అధ్యక్షుడు సలీల్ కపూర్ (70) ఆత్మహత్య చేసుకున్న వైనం పారిశ్రామికవర్గాల్లో షాకింగ్ గా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆయన పిస్టల్ తో కాల్చుకొని మరణించిన విషయాన్ని గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత వ్యక్తులే తనను వేధింపులకు గురి చేసినట్లుగా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాస్త వెనక్కి వెళితే పలు విషయాన్నిగుర్తుకు రావటం ఖాయం. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం 2015లో రూ.9 కోట్ల చీటింగ్ కేసుకు సంబంధించి ఆయన అరెస్టు అయ్యారు. 1950లో జానకీదాస్ కపూర్ స్థాపించిన అట్లాస్ సైకిల్ కంపెనీ దేశంలో ఫేమస్ బ్రాండ్లలో ఒకటి మారిన సంగతి తెలిసిందే.
అయితే.. నిధుల లేమి కారణంగా 2020లో ఈ కంపెనీని మూసేశారు. విషాదకరమైన అంశం ఏమంటే.. ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజైన జూన్ మూడునే అట్లాస్ సైకిల్ కంపెనీ మూత పడింది. సలీల్ కపూర్ కుటుంబ విషయానికి వస్తే.. ఆయన ఫ్యామిలీలో ఆత్మహత్యలు ఎక్కువే. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరైన నటాషా కపూర్ కూడా 2020లో అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం.
ఆమె కూడా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. ఆమె సూసైడ్ వెనుక ఉన్న కారణాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా సలీల్ కపూర్ ఆత్మహత్య చేసుకోవటం షాకింగ్ గా మారంది. ఇంత వయసులో జీవితాన్ని ముగించాల్సి రావటమే అసలుసిసలు విషాదంగా చెప్పాలి.