ఖైదీల కోసం ఏపీలో రూ. 194 కోట్లు... తెలంగాణలో అంత తక్కువా
నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ సందర్భంగా ఏయే రాష్ట్రాల్లో ఖైదీలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారనే వివరాలు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు ఎస్. నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ సందర్భంగా ఏయే రాష్ట్రాల్లో ఖైదీలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారనే వివరాలు వెల్లడించారు.
అవును... 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఖర్చు చేసిన వివరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వివరాలూ వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖైదీలకు రూ.194 కోట్లు కేటాయిస్తుండగా... తెలంగాణలో కేవలం రూ. 21 కోట్లే ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఇక అత్యధికంగా హర్యానాలో రూ.406 కోట్లు, తరువాత ఉత్తర్ ప్రదేశ్ లో రూ.403 కోట్లు ఖర్చయినట్లు సహాయమంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో... 2018లో జైళ్ల సంఖ్య 1,341 ఉండగా... 2022 నాటికి అవి 1,330కి తగ్గినట్టు వెల్లడించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జైళ్ల సంఖ్య 105 నుంచి 106కి పెరగగా... తెలంగాణలో 49 నుంచి 37కి తగ్గినట్లు వివరించారు.
ఏపీలో సొంత భవనాలు లేని పంచాయతీలు 1893!:
ఇదే సమయంలో ఏపీలో సొంతభవనాలు లేని పంచాయతీల వివరాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెల్లడించారు. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లో 13,325 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 1,893 పంచాయతీలకు సొంత భవనాలు లేవని తెలిపారు.
15వ ఆర్థిక సంఘం అన్ టైడ్ గ్రాంట్ కింద 2021-22లో రూ.767.14 కోట్లు, 2022-23లో రూ.393.92 కోట్లు కలిపి రెండేళ్లలో రూ.1,161.06 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రీయ గ్రాం స్వరాజ్ అభియాన్ కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.38.54 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో... ఆయా నిధులను పంచాయతీ భవన నిర్మాణాలు, మరమ్మతులు కోసం ఉపయోగించుకోవచ్చని పాటిల్ తెలిపారు.