అయోధ్య రాముడి పేరు మీద దుర్మార్గం!
క్యూఆర్ కోడ్ ను పంపుతూ.. రామాలయానికి తమ విరాళాల్ని పంపాలని పేర్కొంటూ తెర తీసిన మోసం ఇప్పుడు బయటకు వచ్చింది.
ఏ సీజన్ కు ఆ సీజన్.. ఏ ట్రెండ్ కు తగ్గట్లు ఆ ట్రెండ్ తో ముందుకు వెళుతూ.. అమాయకుల్ని మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకునే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు దేవుడి పేరును వాడేస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తై.. ప్రారంభోత్సవ కార్యక్రమం రోజుల్లోకి వచ్చేసిన వేళ.. దేశ వ్యాప్తంగా రాములోరి ఆలయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ.. అయోధ్య రామాలయానికి విరాళాల పేరుతో సైబర్ నేరాలు దుర్మార్గానికి తెర తీశారు. క్యూఆర్ కోడ్ ను పంపుతూ.. రామాలయానికి తమ విరాళాల్ని పంపాలని పేర్కొంటూ తెర తీసిన మోసం ఇప్పుడు బయటకు వచ్చింది.
దీనికి సంబంధించిన ఒక హెచ్చరికను జారీ చేసింది విశ్వ హిందూ పరిషత్. రామాలయానికి విరాళాల పేరుతో భక్తుల భక్తిని దోచుకునేందుకు సైబర్ నేరగాళ్ల క్యూఆర్ కోడ్ మోసానికి బాధితులుగా మారొద్దని కోరుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ క్యూఆర్ కోడ్ పచ్చి మోసమని స్పష్టం చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుందని.. విరాళాల్ని సేకరించేందుకు ఎవరికి అధికారం లేదని వీహెచ్ పీ స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం అయోధ్య రామాలయం పేరుతో విరాళాలు సేకరిస్తున్న విషయాన్ని తాము గుర్తించినట్లుగా పేర్కొన్నారు.
క్యూఆర్ కోడ్.. ఫోన్ పే.. యూపీఏ పేమెంట్ పేరుతో మోసం చేస్తున్న వారి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి మోసగాళ్ల బారిన పడొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఈ దారుణ మోసానికి సంబంధించిన వివరాల్ని ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర హోంశాఖలకు సైతం లేఖలు రాసినట్లుగా పేర్కొన్నారు. సో.. అయోధ్య రామాలయం పేరుతో విరాళాలు కోరుతూ ఎవరు ఎలాంటి సమాచారం అందించినా.. ఎవరూ మోసపోవద్దు. బీకేర్ ఫుల్.