సానుభూతి కోల్పోయిన 'స్వ‌తంత్రం'!

అయితే.. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌ను ప‌ట్టించుకునే ఓపిక‌, తీరిక‌.. ప్ర‌స్తుత ఓటర్ల‌కు లేకుండా పోయింది. ఎందుకంటే.. ధ‌న బ‌లం, సామాజిక బ‌లం.. వంటివి ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌ను వెంటేసుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నాయి.

Update: 2023-10-21 15:30 GMT

సుమారు ప‌దేళ్ల కింద‌ట వ‌రకు ఎక్క‌డ ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఆయా పార్టీల్లో టికెట్ ల‌భించ‌ని వారు.. లేదా పార్టీల‌కు అతీతంగా రాజ‌కీయాలు చేయాల‌నే వారు నేరుగా ఎన్నిక‌ల గోదాలోకి దిగేవారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీ చేసేవారు. ఇలా.. పోటీ చేసిన అనేక మంది గెలుపు గుర్రాలు ఎక్కిన ప‌రిస్థితి ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు క‌ర్ణాట‌క‌లో ప్ర‌ముఖ న‌టి సుమ‌ల‌త 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

మ‌న రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. 2018లో తెలంగాణ‌లో న‌లుగురు అభ్య‌ర్థులు సొంత‌గా రంగంలోకి దిగారు. 2019లో ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏకంగా ఐదుగురు అభ్య‌ర్థులు పోటీచేశారు. వీరిలో లాయ‌ర్లు, డాక్ట‌ర్లు కూడా ఉన్నారు. అయితే.. వీరికి క‌నీసం డిపాజిట్లు ద‌క్కించుకునేంత‌గా కూడా ఓట్లు రాల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఒక‌రిద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీకి రెడీ అవుతున్నారు.

అయితే.. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌ను ప‌ట్టించుకునే ఓపిక‌, తీరిక‌.. ప్ర‌స్తుత ఓటర్ల‌కు లేకుండా పోయింది. ఎందుకంటే.. ధ‌న బ‌లం, సామాజిక బ‌లం.. వంటివి ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌ను వెంటేసుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న అన‌ధికార లెక్క ప్ర‌కారం.. బీఆర్ ఎస్ కేటాయించిన సీట్ల‌లో 99 శాతం మంది అభ్య‌ర్థులు కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వారేన‌ని తెలిసింది. ఇక‌, వీరిలోనూ పారిశ్రామిక వేత్త‌లు 22 శాతం మంది ఉన్నారు. ఎన్నిక‌ల‌ను ప్రభావితం చేయ‌గ‌ల సామాజిక వ‌ర్గాలు 85 శాతం ఉన్నాయి.

కాంగ్రెస్ విష‌యాన్ని తీసుకున్నా.. వార‌సత్వ రాజ‌కీయాల‌కే ఈ పార్టీ కూడా జై కొట్టింది. అంతేకాదు.. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించి తొలి, మ‌లి జాబితాల్లో టికెట్లు ద‌క్కించుకున్న‌వారంతా 100కు 100 శాతం కోటీశ్వ‌రులు. వీరిలో 50 శాతం మంది ఆస్తి..వంద‌ల కోట్ల రూపాయ‌లు దాటిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. సో.. మొత్తానికి ఇంత బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌తో పోటీ ప‌డ‌గ‌ల స‌త్తా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు లేకుండా పోవ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల ఎన్నిక‌ల ఆకాంక్షాల‌ను కూడా.. వీరు తీరుస్తార‌నే న‌మ్మ‌కం లేక‌పోవ‌డం కూడా.. స్వ‌తంత్ర రాజ‌కీయాల‌పై వేటు వేస్తోంది.

ఒక‌ప్పుడు స్వ‌తంత్రంగా గెలిచిన అభ్య‌ర్థులు.. తుది వ‌ర‌కు అలానే ఉండిపోయేవారు. కానీ, నేడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గెలిచినా.. ఆ మ‌రుక్ష‌ణ‌మే అధికార పార్టీకి జైకొడుతున్నారు. ఇది కూడా ప్ర‌జ‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌పై ఉన్న సానుభూతిని మ‌ట్టిక‌రిపించింది. వెర‌సి.. ఇప్పుడు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు అనే మాట వినిపించే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News