ఏపీలో ఉచిత ఇసుక.. విధివిధానాలు ఇవీ!
ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరో మేజర్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసింది.
ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరో మేజర్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మరో కీలకమైన హామీ.. ఉచిత ఇసుక. దీనిని అమలు చేస్తూ.. తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై చంద్రబాబు సోమవారం సంతకం చేయనున్నారు. ఆ వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది.
ఎలా ఇస్తారు?
+ ఇసుక ఉచితం.. అంటే..అది కేవలం మెటీరియల్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంటే.. ఇసుకను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అదేసమయంలో సర్కారుకు పన్నులు కూడా చెల్లించాల్సిన పనిలేదు.
+ కానీ, ఇసుకను తోడేందుకు కూలీలు ఉంటారు. వారికి కూలి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రీచ్ పాయింట్ నుంచి ఇంటి వరకు రవాణాకు అయ్యే సొమ్మును కూడా.. వినియోగదారులు చెల్లించాలి.
+ వినియోగదారుల ఇంటికి రీచ్ కొంచెం దగ్గరలోనే ఉంటే.. తోడుకుని.. తరలించుకునేందుకు కూడా.. ఎవరికీ ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం ఉండదు.
+ రోజుకు ఒక వినియోగదారుడికి 20 టన్నుల వరకు ఉచితంగా ఇసుక ఇస్తారు.
+ ఏపీశాండ్ పోర్టల్‌లో ముందుగానే వివరాలు నమోదు చేసుకోవాలి. ఎంత కావాలో కూడా తెలపాలి. ఆధార్ సహా ఇంటి నెంబరు, పన్ను రశీదు వంటివి కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
+ రాష్ట్ర వ్యాప్తంగా మిషనరీ సాయం లేకుండా.. కూలీలతో తోడుకునే రీచ్‌లు(వీటిని బీ-1 గా పేర్కొంటారు) 83 ఉన్నాయి. వాటి నుంచి వినియోగదారులు నేరుగా ఇసుకను తీసుకోవచ్చు.
+ ఇప్పటి వరకు ఉన్న ప్రైవేటు కంపెనీలైన ప్రతిమ ఇన్ ఫ్రా, బీకేసీ వంటి వాటి ఆధిపత్యం పోతుంది. ఇక నుంచి ఏపీ గనుల శాఖ ఆధ్వర్యంలోనే ఇసుక లావాదేవీలు జరగనున్నాయి. ఈ శాఖ నుంచే ఉచితంగా ఇసుకను పంపిణీ చేయనున్నారు.