ప్రజా యుద్ధనౌకకు నివాళి.. 'నంది' స్థానంలో గద్దర్ అవార్డులు
ఇప్పటివరకు నంది పేరిట ఇస్తున్న అవార్డును ప్రఖ్యాత కళాకారుడు, దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరిట ప్రదానం చేయనున్నట్లు సీఎం రేవంత్ సంచలన నిర్ణయం వెల్లడించారు.
ఉమ్మడి ఏపీలో సినిమా పురస్కారాలు అంటే.. 'నంది' అవార్డులే. అలాంటి అవార్డులు రాష్ట్ర విభజన తర్వాత ప్రదానం చేయడం ఆగిపోయింది. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలను ఇచ్చేవారు. ఈ సంప్రదాయం 1964లో ఉమ్మడి ఏపీలో ఉండగా మొదలైంది. అప్పట్లో చిత్ర నిర్మాణం చాలా తక్కువగా ఉండేది. ఏడాదికి సుమారు 25 నుంచి 30 వరకు సినిమాలు నిర్మాణమయ్యేవి. తొలుత బంగారు, రజత, కాంస్య నంది అనే 3 బహుమతులు, కథకు 2 బహుమతులు మొత్తం 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణంలో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహం అందించే విధంగా సంఖ్యను 42 కు పెంచారు. కాగా, లేపాక్షి నంది ఏపీలోని అనంతపురం (ప్రస్తుతం హిందూపురం జిల్లా)లో ఉంది. విభజన తర్వాత నంది అవార్డులను ఏపీకి పరిమితం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొనసాగించలేదు.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నంది అవార్డుల ప్రదానం ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నంది అవార్డుల ప్రదానం గురించి స్పష్టంగా చెప్పారు. ఇలాంటి సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు నంది పేరిట ఇస్తున్న అవార్డును ప్రఖ్యాత కళాకారుడు, దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరిట ప్రదానం చేయనున్నట్లు సీఎం రేవంత్ సంచలన నిర్ణయం వెల్లడించారు. ఈ మేరకు సినిమా అవార్డులపై అత్యంత కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నంది అవార్డులను పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరినట్లు చెప్పిన సీఎం.. వాటి స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులిస్తామని పేర్కొన్నారు.
గద్దర్ కు సముచిత గౌరవం
నంది అవార్డులను గద్దర్ పేరిట ప్రదానం చేయడం అంటే అసాధారణ నిర్ణయమే. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రజా గళం ఓ వెలుగు వెలిగిన గద్దర్.. ఇటీవలనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. విప్లవ గాయకుడిగా, మావోయిస్టుగా, ప్రజా కళాకారుడిగా తన పాట, ఆటతో ఎందరినో ఉర్రూతలూగించారు గద్దర్. ఆయన ఆటపాటకే వేలాదిమంది అడవుల బాట పట్టారంటే ఆశ్చర్యం లేదు. అలాంటి గద్దర్ పేరిట సినీ అవార్డులను ఇవ్వడం అంటే ఆయనకు సముచిత గౌరవం ఇచ్చినట్లు. వాస్తవానికి గద్దర్ జీవించి ఉంటే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేవారు. అయితే, అనూహ్యంగా మరణించారు. ఇప్పుడు ఆయనను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తోంది.
కొసమెరుపు: ఒకప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ ముందు పడిగాపులు కాశారు గద్దర్. అలాంటి వ్యక్తి కేసీఆర్ నియంత పాలన పోవాలంటూ నినదించారు. అది సాకారం అయ్యేనాటికి భౌతికంగా లేరు. ఆయన పేరు మాత్రం ఇకపై నిలిచిపోయేలా చేసింది రేవంత్ ప్రభుత్వం.