గోడకు కొట్టిన బంతిలా గండి బాబ్జీ....టీడీపీయే దిక్కు...!
విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు అన్న అసంతృప్తితో పార్టీని కొద్ది రోజుల క్రితం వీడిపోయారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ.
విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు అన్న అసంతృప్తితో పార్టీని కొద్ది రోజుల క్రితం వీడిపోయారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. ఆయన ఏకంగా టీడీపీ అధినాయకత్వాన్ని విమర్శిస్తూ పార్టీకి దండం పెట్టేశారు. రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈసారి తాను ఎమ్మెల్యేగా పోటీలో ఉంటాను ఏ పార్టీ అన్నది చెబుతాను అని మీడియా ముందు చెప్పి మరీ ఆయన ఫ్లైట్ ఎక్కారు.
ఆయన వైసీపీలో చేరుతారని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. నిజానికి వైసీపీలో ఉన్న నేతగానే గండి బాబ్జీకి పేరుంది. 2014లో ఆయన పెందుర్తి నుంచి ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేశారు కూడా. అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఆయన వైసీపీని వీడారు.
ఇక ఆయన పెందుర్తి నుంచి పోటీ చేయడానికి చూసారు అని ప్రచారం సాగింది. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ని తిరిగి ఇచ్చింది. దాంతో పాటు వేరే ఇతర పార్టీలు లేకపోవడంతో గండి బాబ్జీ పట్టు మంది పది రోజులు కూడా గడవకముందే గోడకు కొట్టిన బంతిలా టీడీపీ గూటికి చేరారు.
ఆయనను తీసుకుని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి శ్రీభరత్ నారా లోకేష్ సమక్షంలో మరోసారి పార్టీ కండువా వేయించారు. ఇక తాను టీడీపీ విజయానికి కృషి చేస్తాను అని గండి బాబ్జీ ప్రకటించారు. నారా లోకేష్ టీడీపీ అధికారంలోకి వస్తే పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. దాంతో గండి బాబ్జీ సంతృప్తి చెందారు అని అంటున్నారు.
ఇక గండి బాబ్జీ విశాఖ సౌత్ లో పార్టీని తన వంతుగా పటిష్టం చేశారు. ఆయన రాజీనామాతో పార్టీ ఇబ్బందుల్లో పడింది. ఇపుడు ఆ సీటుని జనసేనకు ఇచ్చినా అక్కడ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో సీనియర్ నేతగా గండి బాబ్జీని అక్కడ ఉంచితే సౌత్ సీటుతో పాటు ఎంపీ గా కూడా గెలుచుకునేందుకు వీలు ఉంటుందని శ్రీ భరత్ ఆలోచించి గండి బాబ్జీని తిరిగి పార్టీలోకి తీసుకుని వచ్చారు అని అంటున్నారు. మొత్తానికి కోపంతో పార్టీని వీడిన మరెంత మంది ఇపుడు వెనక్కి తిరిగి వస్తారో చూడాలని అంటున్నారు.