గంటా సీటును లేపేస్తున్న జనసేన....?
గంటా మీద జనసేన అధినాయకత్వానికి మొదటి నుంచి కొంత చికాకు ఉందని అంటున్నారు.
విశాఖ టీడీపీ రాజకీయాన్ని కకావికలు చేయడానికా జనసేనతో పొత్తులు అన్నట్లుగా పరిస్థితి ఉంది అని తమ్ముళ్ళు కలవరపడుతున్నారని టాక్. వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేసి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన శుక్రవారం తమ అభిమానులు, అనుచరులతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తాను చేరబోయే పార్టీ ఏంటో చెప్పకుండానే చెప్పేశారు. ఆయన అభిమానులు జై జనసేన అని నినదించారు. దాంతో పంచకర్ల ఎస్ అన్నట్లుగా తలూపేశారు.
ఇక తాను పోటీ చేయబోయే సీటు పెందుర్తి అని కుండబద్ధలు కొట్టారు. తాను ఈ నెల 18 తరువాత ఎపుడైనా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇక జనసేనలో పంచకర్ల చేరి పెందుర్తి టికెట్ కోరితే టీడీపీలో తలపండిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సంగతేంటి అన్నదే చర్చకు వస్తోంది. పొత్తులు ఉంటే కనుక జనసేన పెందుర్తిని వదులుకోదు అని అంటున్నారు. అంటే బండారుకు గట్టి షాక్ అన్న మాట.
మరో వైపు ఇంకో విషయం కూడా ఇపుడు ఆసక్తికరంగా మారింది. విశాఖ ఉత్తరం సీటు విషయంలో కూడా జనసేన గురిపెట్టింది అని అంటున్నారు. విశాఖ ఉత్తరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన ఇటీవల రీ యాక్టివ్ అయ్యారు. మరోసారి పోటీకి ఆయన సిద్ధపడుతున్నారు. ఉత్తర నియోజకవర్గంలో పాదయాత్రలు కూడా చేస్తున్నారు.
అయితే ఇపుడు ఆ సీటుని జనసేన టార్గెట్ చేసింది అని తెలుస్తోంది. ఈ సీటు నుంచి జనసేన మహిళా నేతగా ఉన్న పసుపులేటి ఉషాకిరణ్ కి ఇస్తారని అంటున్నారు. ఆమె 2019లో ఇక్కడ పోటీ చేసి దాదాపుగా ఇరవై వేల దాకా ఓట్లను తెచ్చుకున్నారు. ఆమె విశాఖ జనసేనలో గట్టిగా పనిచేసే నేతగా ఉన్నారు. దాంతో ఆమెకు టికెట్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. అదే టైం లో విశాఖ ఉత్తరంలో కూడా కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు.
దాంతో ఆ సీటు నుంచి కూడా పోటీ చేతే ప్లస్ అవుతుందని జనసేన కొత్త ఆలోచనలు చేస్తోందిట. ఇప్పటికే భీమునిపట్నం, గాజువాకల నుంచి జనసేన పోటీ అని ప్రచారం ఉంది. పెందుర్తి, విశాఖ నార్త్ లను కలుపుకుంటే విశాఖ జిల్లాలో మొత్తం ఏడు సీట్లకు గానూ జనసేనకే నాలుగు పోతాయన్న మాట. వాటి సంగతి అలా ఉంచితే గంటా శ్రీనివాసరావు సీటుకు టిక్కెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
గంటా మీద జనసేన అధినాయకత్వానికి మొదటి నుంచి కొంత చికాకు ఉందని అంటున్నారు. పవన్ సైతం తమ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి గంటా సహా కొందరు నాయకులు కారకులు అని అనుమానిస్తూ వస్తున్నారు గంటా జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా తీసుకోలేదన్న ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ గంటా మీద పవన్ అప్పట్లో చేసిన విమర్శలు హాట్ హాట్ చర్చకు దారితీశాయి.
ఇపుడు ఏకంగా గంటా సీటే లేపేయడానికి జనసేన చూస్తోంది అంటే లెక్క ఎక్కటో సెట్ చేయాలనేనా అన్నదే టీడీపీ జనసేనలో వినిపిస్తున్న మాటగా ఉంది. మరి చంద్రబాబు ఇన్ని సీట్లు ఇవ్వడానికి ఓకే చెబుతారా అన్నది కూడా చూడాలని అంటున్నారు.