బీజేపీపై ఎన్నికల 'బండ'.. దెబ్బకు 200 తగ్గించారు

మోదీ ప్రభుత్వం సామాన్యుడి సంక్షేమ పథకాల విషయంలో మహా జిడ్డు. ఓ మాదిరి సంక్షేమానికీ వ్యతిరేకం అన్నట్లు ఉంటాయి వారి చర్యలు

Update: 2023-08-29 11:24 GMT

సరిగ్గా 9 ఏళ్ల కిందట వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.500 లోపే.. మరిప్పుడు రూ.1150.. ఇదే కాదు పెట్రోల్ ధర రూ.70 వరకు ఉండేది . ఇప్పుడు రూ.110. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై మోపిన భారం ఇది. ఎవరెన్ని చెప్పినా.. ఈ విషయంలో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ వంటి యువ నాయకులైతే.. ''గ్యాస్ బండ'' ధరను ప్రత్యేకంగా ప్రస్తావించి మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? అంటూ నిలదీశారు.

ఇంటి బడ్జెట్ పెంచేసిన బండ

పదేళ్ల కిందట గ్యాస్ బండ రూ.400కు చేరితేనే అయ్యో అమ్మో అన్నారు. కానీ, ఇప్పుడు రూ.1150 అయింది. క్రెడిట్ కార్డులో డెబిట్ కార్డులో ఉండి.. వాటి పైన ఆఫర్ వచ్చినవారికి రూ.50 తగ్గేది. ఇవేవీ లేనివారికి ఆ చాన్సు కూడా లేదు. ఓ విధంగా చెప్పాలంటే సామాన్యుడికి వంట గ్యాస్ బండ ధర మోయలేనంత భారంగా మారింది. ఇంటి బడ్జెట్ ను అమాంతం పెంచేసింది.

9 ఏళ్లలో మూడు రెట్లు

వంట గ్యాస్ సిలిండర్ ధర 9 ఏళ్లలో మూడు రెట్లు పెరిగింది. 2014 కు ముందు రూ.400 చిల్లర ఉన్ ధర ఇప్పుడు రూ.1,150. అంతేకాదు.. అప్పట్లో సబ్సిడీ కింద రూ.200 వినియోగదారుడి ఖాతాలో పడేది. ఇప్పుడది రూ.40కి తగ్గిపోయింది. ఈ విధంగానూ.. రావాల్సిన రూ.160కి కోతపడింది. అయితే, ఇప్పటికే బండ ధరపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు మోదీ సర్కారుకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నారని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనిని గమనించే ఏమో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై ఒక్కసారిగా రూ.200 తగ్గించింది.

ఎన్నికల ముదు ప్రేమ

మోదీ ప్రభుత్వం సామాన్యుడి సంక్షేమ పథకాల విషయంలో మహా జిడ్డు. ఓ మాదిరి సంక్షేమానికీ వ్యతిరేకం అన్నట్లు ఉంటాయి వారి చర్యలు. అలాంటిది గ్యాస్ బండపై ఒక్కసారిగా రూ.200 తగ్గించడం అంటే జనం నోరెళ్లబెట్టాల్సిందే. అయితే, దీనివెనుక ఎన్నికలు ఉన్నాయన్న సంగతిని గుర్తుచేసుకోవాలి.

సెమీఫైనల్స్ కావడంతో

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలున్నాయి. వీటిలో గనుక పరాజయం పాలైతే బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదు. దీనిని గ్రహించి.. ప్రజలను మచ్చిక చేసుకునేందుకు గ్యాస్ బండపై రూ.200 తగ్గించింది. తగ్గింపు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించడం ఎన్నికల మహత్తే మరి.

Tags:    

Similar News