ఎన్నికల్లో రష్యా వేలు?..ప్రతిపక్షాలతో కలిసి వీధుల్లోకి అధ్యక్షురాలు
ఆ దేశం ఏదో కాదు.. ఒకప్పుడు తమ నుంచి విడిపోయినదే కావడం ఇక్కడ గమనార్హం.
‘ఒక పెద్ద దేశం.. తమ పక్కనున్న దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది’ అనే ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే.. అమెరికా, రష్యాలాంటి ప్రపంచ శక్తుల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువ.. సుదూరంగా ఉన్న దేశాల అంతర్గత విషయాల్లోకి చొచ్చుకెళ్లే తీరు వీటిది. అంతెందుకు..? 2016 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నకు అనుకూలంగా రష్యా పనిచేసిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు మరో దేశ ఎన్నికల విషయంలోనూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశం ఏదో కాదు.. ఒకప్పుడు తమ నుంచి విడిపోయినదే కావడం ఇక్కడ గమనార్హం.
అసలేమిటీ గోల..?
జార్జియా.. మనందరికీ బాగా తెలిసిన పేరే.. చాలా తెలుగు సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకొన్నాయి. భారతీయ విద్యార్థులు ఈ దేశంలో మెడిసిన్ చదివేందుకు వెళ్తుంటారు. కాగా, ఒకప్పుడు యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్)లో జార్జియా కూడా ఒక భాగం. అయితే, 1990 తర్వాత యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన 15 దేశాల్లో ఇదీ ఒకటి. తాజాగా జార్జియాలో ఎన్నికలు జరిగాయి. కానీ.. ఫలితాలపై మాత్రం తీవ్ర వివాదం నెలకొంది. దానికి కారణం రష్యా అనే ఆరోపణలు వస్తున్నాయి.
గెలుపు డ్రీమ్ చెల్లదంటూ..
రష్యాకు పక్కనే ఉండే జార్జియాలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వీటిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జార్జియా డ్రీమ్ పార్టీ 54.8 శాతం ఓట్లతో విజయం సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది కూడా. అయితే, డ్రీమ్ పార్టీని స్థాపించింది బిడ్జినా ఇవానిష్విలి. రష్యాలో రూ.వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఇతడు. అయితే, డ్రీమ్ పార్టీ విజయాన్ని జార్జియా అధ్యక్షురాలు సలోమీ జౌరాబిచ్విలి అంగీకరించడం లేదు. అంతేకాక ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలతో కలసి జార్జియా రాజధాని టిబిలిసి వీధుల్లోకి వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. తమ దేశ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ ప్రతిపక్షాలు, అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) తమకు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో జార్జియా డ్రీమ్ పార్టీ పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ప్రజలు రెచ్చగొట్టిందని.. రష్యా కూడా నిరంకుశంగా ఓటర్లను బెదిరించిందనీ ఈయూ పార్లమెంటు ప్రతినిధి ఆరోపిస్తున్నారు. వీటిని రష్యా కొట్టిపారేస్తోంది. కాగా, ఈయూలో చేరతామని, రష్యాతో సంబంధాలను పునరుద్ధరిస్తామని జార్జియా డ్రీమ్ పార్టీ ప్రచారం చేయడం గమనార్హం.
జనాభా 40 లక్షల్లోపే.. కానీ చాలా కీలకం
జార్జియా జనాభా 37 లక్షలు మాత్రమే. కానీ, రష్యాకు వ్యూహాత్మకంగా ఇది చాలా కీలక దేశం. ప్రధానంగా తుర్కియేతో సరిహద్దును కలిగి ఉంది. రష్యా, అర్మేనియా, అజర్ బైజాన్, నల్ల సముద్రం కూడా సరిహద్దులుగా ఉన్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్న ఈ దేశం.. తమ మదర్ కంట్రీ అయిన రష్యాతో 2008లో యుద్ధానికి దిగి ఓడిపోవడం గమనార్హం.