ఏమిటీ జీసీసీ సెంటర్లు? తోపు కంపెనీలన్నీ చూస్తున్న ఆ మహానగరాలివే!

కాలం మారింది. పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన బడా కంపెనీలు ఇప్పుడు తమ సంస్థ కార్యాలయాలతో పాటు

Update: 2024-04-21 05:40 GMT

కాలం మారింది. పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన బడా కంపెనీలు ఇప్పుడు తమ సంస్థ కార్యాలయాలతో పాటు.. ఉత్పత్తి కేంద్రాల్ని ఓపెన్ చేసేందుకు భారతదేశం వైపు చూస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతుంది. జీసీసీ (గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల) స్థాపన కోసం అగ్రశ్రేణి కంపెనీల చూపు ఇప్పుడు భారత్ మీద పడితే.. అందులోనూ రెండు మహానగరాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. అందులో మొదటిది బెంగళూరు కాగా.. రెండోది హైదరాబాద్.

సాంకేతిక నైపుణ్యంతో పాటు మానవ వనరుల లభ్యత అధికంగా ఉండటంతో పాటు.. ప్రభుత్వ మద్దతు ఎక్కువగా ఉన్న ఈ రెండు మహానగరాల వైపు అగ్రశ్రేణి కంపెనీలు చూస్తున్నాయి. మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో సానుకూల అంశాలు అధికంగా ఉండటంతో దేశానికి వస్తున్న బహుళజాతి సంస్థలను బెంగళూరు.. హైదరాబాద్ మహానగరాలు ఆకర్షిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా విడుదలైన నివేదిక ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జీసీసీ కేంద్రాల వ్యాపారం విలువ 46 బిలియన్ డాలర్లు కాగా.. మరో ఆరేళ్లలో దీని సైజు భారీగా పెరగుతుందని చెబుతున్నారు. దగ్గర దగ్గర 110 బిలియన్ డాలర్ల వరకు చేరుకునే ఈ వ్యాపారాన్ని రూపాయిల్లో చెప్పాలంటే రూ.9 లక్షల కోట్లుగా చెప్పాలి. దేశానికి వచ్చే జీసీసీల కారణంగా 45 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు.

జీసీసీ కేంద్రాల ఏర్పాటులో దేశంలోని అన్ని మహానగరాలు పోటీ పడుతుండగా.. దేశానికి వచ్చే వాటిల్లో 30 శాతం కంపెనీలు బెంగళూరును ఎంపిక చేసుకుంటుంటే.. 19 శాతం కంపెనీలు హైదరాబాద్ ను సెలెక్టు చేసుకుంటున్నాయి. దీంతో.. ఈ రెండు మహానగరాలు మొదటి రెండుస్థానాల్లో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ.. ముంబయి.. పుణె.. చెన్నై మహానగరాలు ఉన్నాయి.

జీసీసీ కేంద్రాల్లో ఎక్కువగా సాంకేతిక అంశాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెషీన్ లెర్నింగ్.. డేటా అనలిటిక్స్ ప్రాజెక్టులు చేపట్టే సత్తా ఉన్న కేంద్రాలను ఎక్కువగా ఓపెన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన జీసీసీ కేంద్రాల్లో అధిపతులుగా తమ సంస్థ హెడ్డాఫీసుల నుంచే సీఈవో.. సీఐవోలుగా ఎంపిక చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారి.. స్థానిక టాలెంట్ మీదా ఫోకస్ చేస్తున్నారు. దీంతో.. ఉన్నత స్థానాల కోసం మనోళ్లకు అవకాశాల్ని ఇస్తున్నారు. దీంతో విదేశీయుల స్థానంలో మనోళ్లకు అత్యుత్తమ స్థానాల్లో పని చేసే అవకాశం లభిస్తోంది.

స్థానిక అంశాల మీద పట్టు ఉండటంతో పాటు.. సంస్థ అవసరాల్ని గుర్తించి మెసులుకునే సత్తా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ తరహాలో ఎంపికలు ఉంటున్నట్లు చెబుతున్నారు. జెనరేటివ్ ఏఐ.. ఏఐ/ఎంఎల్.. డేటా అనలిటిక్స్.. సైబర్ సెక్యూరిటీ.. క్లౌడ్ నైపుణ్యం ఉన్న వారికి మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. దేశానికి వస్తున్న జీసీసీ సెంటర్ల కారణంగా ఆయా నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతంగా మారుతోంది. మనదేశంలో 15 నగరాల్లో జీసీసీ కేంద్రాలు షురూ అవుతుంటే.. అందులో బెంగళూరు ముందుంది. అగ్రశ్రేణి మహా నగరాలతో పాటు.. అహ్మదాబాద్.. కోయంబత్తూరు.. భువనేశ్వర్.. వడోదర లాంటి టూటైర్ మహా పట్టణాలు ఆకర్షిస్తున్నాయి. దేశంలో ఏర్పాటు చేస్తున్న డీసీసీల్లో ఎక్కువగా డిజిటల్ సామర్థ్యాలున్న వాటినే ఏర్పాటు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News