దేవుడు సాక్ష్యం చెప్పలేడు...విజయమ్మ చెబుతారా...!?

అది లగాయితూ ఈ రోజు వరకూ అన్న మీద విమర్శల జడివాన కురిపిస్తున్నారు.

Update: 2024-01-26 04:08 GMT

అన్నా చెల్లెలు తగవు మధ్యలో తల్లిని లాగారు. అలా లాగింది ఎవరో కాదు స్వయాన కుమార్తె వైఎస్ షర్మిల. ఆమె పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తూనే జగన్ మీద విమర్శల జోరు పెంచేశారు. అసలు ఆమె జగన్ మీద విమర్శలు చేయాలని ఎంతలా ఉబలాటపడ్డారో మరి విజయవాడలో ఆమె కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు అని ఆ ఒక్క దానికే ఫైర్ అయిపోయి భయపడుతున్నారా సార్ అంటూ మొదలెట్టేశారు.

అది లగాయితూ ఈ రోజు వరకూ అన్న మీద విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఆమె వైసీపీ నేతలు చేసే ప్రతీ విమర్శకూ జవాబు చాలా ఓపికగా ఇస్తున్నారు. అది కార్యకర్తల మీటింగులో అయినా లేక మీడియా మీటింగులో అయినా ఏదో ఒక దాంట్లో వెంటనే కౌంటర్ వేస్తున్నారు. ఆ వేడిని అలా పెంచేస్తున్నారు. ఎక్కడా చల్లార్చడం లేదు కదా ముగ్గులోకి లాగుతున్నారు.

దానికి తగినట్లుగానే వైసీపీ నుంచి కూడా గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇక జగన్ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో పాల్గొన్నారు. అక్కడ ఆయనంతట ఆయన సోదరి గురించి ప్రస్తావన తేలేదు. యాంకర్ అడిగిన దానికి బదులిస్తూ కాంగ్రెస్ ని నిందించారు తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, చీలిక తెస్తోందని ఆయన అన్నారు.

అది బుధవారం రాత్రి జరిగింది. అంతే తెల్లారుతూనే షర్మిల దానికి గట్టి కౌంటర్ ఇచ్చేశారు. ఆమెకు అలా చాన్స్ జగనే ఇచ్చారా అన్నది కూడా అంతా అంటున్న మాట. ఇంతకీ షర్మిల ఏమన్నారు అంటే వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టింది చీలిక తెచ్చింది జగనే అంటూ చాలా హాట్ కామెంట్స్ ని ఆమె చేశారు. దానికి అమ్మ తోడు అని ఒట్టు కూడా పెట్టేశారు. అంతే కాదు పైన ఉన్న దేవుడు, అలాగే తన తల్లి వైఎస్ విజయమ్మ సాక్ష్యం అని కూడా ఆమె చెప్పారు. అలా ఆమె విజయమ్మని తమ రాజకీయ వివాదంలోకి లాగేశారు.

అసలే కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు రాజకీయం కోసం సమరం చేసుకుంటూ ఎదురు బొదురుగా నిలిచారు అని విజయమ్మ బాధపడుతున్న నేపధ్యంలో ఆమెను కుటుంబ గొడవలకు సాక్ష్యం అని షర్మిల లాగడం మీద చర్చ సాగుతోంది. ఇపుడు విజయమ్మ ఏమి చెబుతారు అన్నది కూడా అందరిలో ప్రశ్నగా ఉంది. దేవుడు ఎటూ మౌనంగా ఉంటాడు.ఆయన ఎవరికీ పలకరు.

మరి విజయమ్మ పలుకుతారు. ఎదురుగా ఉన్నారు. అందువల్ల ఆమె సాక్ష్యానికే విలువ ఎక్కువ. మరి ఆమె ఎవరి పక్షం చెబుతారు అన్నది కూడా ప్రశ్న. ఎందుకంటే అటు చూస్తే కుమారుడు, ఇటు చూస్తే కుమార్తె ఇద్దరూ ఉన్నారు. ఎవరికి ఆమె అనుకూలం అవుతారు. ఎవరిని దూరం చేసుకుంటారు. ఇది ఆమెకు ఇబ్బంది కలిగించే విషయం.

షర్మిల తెలిసి చేశారా లేక ఆవేశంతో అన్నారా అన్నది పక్కన పెడితే విజయమ్మ మీదనే అందరి చూపులు ఉండేలా చేశారు. కుటుంబంలో గొడవలు సహజం. అది ఈ రోజున అన్ని చోట్లా ఉన్నాయి. దానికి ఎవరూ అతీతులు కారు. సరే దారులు వేరు అయ్యాక ఎవరి రాజకీయం వారు చేసుకుంటారు.

అయితే పెద్ద వారూ తల్లిదండ్రులు వీటిని చూస్తూ ఉంటారు. బాధ పడతారు. ఎందుకంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్న సామెత ఉంది. విజయమ్మది అదే పరిస్థితి. ఆమె తన భర్తను పోగొట్టుకుని ఇప్పటికీ ఆ బాధలో ఉన్నారు. ఇపుడు రాజకీయాల్లో రాణించాలన్న ఉద్దేశ్యంలో ఇద్దరు బిడ్డలూ ఇలా చెరో వైపు ఉండడమే తీరని బాధ. ఇక ఆమె సాక్ష్యం అంటే అంతకంటే అగ్ని పరీక్ష ఉంటుందా అన్నదే అందరి ఆలోచన. ఏది ఏమైనా రానున్న రోజులలో విజయమ్మను తన వైపునకు తిప్పుకునే ఉద్దేశ్యంలో షర్మిల ఉన్నట్లుగా ఉన్నారు.

ఆమె కూడా తన పక్కన ఉండి జగన్ ని ఎదిరించి విమర్శిస్తే అపుడు ఇంకా సెంటిమెంట్ పండుతుంది అని ఆమె కానీ ఆమె వెనక ఉన్న కాంగ్రెస్ కానీ అనుకుంటే అపుడు చూడాలి ఏపీ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో.


Tags:    

Similar News