శాసనమండలి .. హఠాత్తుగా తెర మీదకు గోనె ?!

‘‘రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదు. 120 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే శాసనమండలి ఏర్పాటు చేయాలి.

Update: 2024-07-26 10:32 GMT

‘‘రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదు. 120 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే శాసనమండలి ఏర్పాటు చేయాలి. తెలంగాణలో కేవలం 119 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఉన్నాయి. దీని మీద నేను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాను. కోర్టులో పిటీషన్ కూడా వేస్తాను. తెలంగాణలో శాసనమండలి రద్దు కావడం ఖాయం’’ అని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడాడు.

అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీకి అప్రదిష్ట తెస్తాయి. దీని మీద న్యాయస్థానానికి వెళ్తే అనర్హత వేటు పడుతుంది. 2/3 చేరికలు ఉంటే తప్ప బీఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యం కాదు అని, కేసీఆర్ హయాంలో 2014 నుండి 2023 వరకు ఇలాగే చేరికలు జరిగాయని, దానికి అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు నైతిక బాధ్యత వహించాలని గోనె ప్రకాష్ రావు అన్నారు.

1983లో సంజయ్ విచార్ మంచ్ తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనె ప్రకాష్ రావు కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి మీద 6427 ఓట్లతో గెలిచాడు. ఆ తర్వాత ఆరు నెలలకు తన పదవికి రాజీనామా చేశాడు. వైఎస్ కు సన్నిహితుడిగా పేరు పడ్డ గోనె ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశాడు.

అయితే ఇటీవల ఏపీ ఎన్నికలకు ముందు కూడా జగన్, షర్మిలలకు అనేక సూచనలు చేసిన గోనె చాలా కాలం తర్వాత హఠాత్తుగా శాసనమండలి రద్దు అంశాన్ని తీసుకుని మీడియా ముందుకు రావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. అసలు ఈ శాసనమండలి అంశం ఇఫ్పుడెందుకు వచ్చింది ? అసలు గోనె మీడియా సమావేశం వెనక ఎవరున్నారు ? అన్న చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News