సంపదలో ఇన్ఫో మూర్తినే మించిన సహచరుడు..

కాగా, ఇన్ఫోసిస్ స్థాపనలో నారాయణమూర్తికి తోడుగా నిలిచినవారిలో ఒకరు గోపాలకృష్ణన్. ఈయనను షార్ట్ కట్ లో ముద్దుగా క్రిస్ అని పిలుచుకుంటారు.

Update: 2024-09-10 19:30 GMT

భారతదేశంలో సాఫ్ట్ వేర్ ఐకాన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. కొంతమంది స్నేహితులతో కలిసి ఓ నలభై ఏళ్ల కిందట ఆయన మొదలుపెట్టిన ప్రయత్నం ఇప్పడు ప్రపంచ పటంలో భారత్ ను సగర్వంగా నిలిపింది. వేలాదిమంది జీవితాలను మార్చింది. లక్షల మందికి పరోక్షంగా సాయపడుతోంది. కాగా, ఇన్ఫోసిస్ స్థాపనలో నారాయణమూర్తికి తోడుగా నిలిచినవారిలో ఒకరు గోపాలకృష్ణన్. ఈయనను షార్ట్ కట్ లో ముద్దుగా క్రిస్ అని పిలుచుకుంటారు.

సేనాపతి..

గోపాలకృష్ణన్ కు ఇన్ఫోసిస్ సేనాపతి అని చెప్పాలి. సహ వ్యవస్థాపకుడైన ఈయన గతంలో ఇన్ఫోసిస్ చైర్మన్, సీఈవో, ఎండీగానూ పనిచేశారు. అయితే, ఇప్పుడు సంపద పరంగా నారాయణమూర్తి కంటే ఈయనే ధనికులు కావడం గమనార్హం. అదికూడా ఏదో తక్కువ స్థాయిలో కాదు.. నారాయణమూర్తి కంటే క్రిస్ సంపద సుమారు 1,900 కోట్లు అధికం.

62వ స్థానంలో..

క్రిస్.. సంపద రూ.38,500 కోట్లు. ఈయన 2024 హురూన్ ఇండియా ధనవంతుల జాబితాలో 62వ స్థానంలో నిలిచారు. బెంగళూరులోని సంపన్నుల్లో ఒకరైన క్రిస్.. సంపదలో తన మిత్రుడు నారాయణమూర్తి ఆయన భార్య సుధామూర్తి (రూ.36,600 కోట్లు)ని మించారు. కాగా, గోపాలకృష్ణన్ 2007 – 11 మధ్య ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్లు వైస్ చైర్మన్‌ గా పనిచేశారు. ఆ ఏడాది పదవీ విరమణ చేశారు.

పదేళ్లుగా మార్గదర్శిగా..

రిటైర్ మెంట్ తర్వాత క్రిస్ తన వ్యాపార ఇంక్యుబేటర్ ఆక్సిలర్ వెంచర్స్-వివిధ వెంచర్ ఫండ్స్ ద్వారా కి మొబిలిటీ, ఆటోమొబైల్ సేవలను అందించే అనేక స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టారు. 69 ఏళ్ల గోపాలకృష్ణన్ గుడ్‌హోమ్, కాగజ్, ఎన్‌కాష్ వంటి కంపెనీలకు మద్దతునిచ్చిన స్టార్టప్ యాక్సిలరేటర్ ఆక్సిలర్ వెంచర్స్‌ కు చైర్మన్‌ గా ఉండడం గమనార్హం. మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫిజిక్స్-కంప్యూటర్ సైన్స్‌ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన క్రిస్.. అనంతరం ఇన్ఫోసిస్ స్థాపనలో భాగమమ్యారు. మరోవైపు ఆయనకు 2011లో పద్మభూషణ్ లభించింది. తాను చదివిన మద్రాస్‌ ఐఐటీలోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌ కు ఆయన తన భార్య పేరు పెట్టారు. మద్రాస్ ఐఐటీ, బెంగళూరు ఐఐఎం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ లో పనిచేస్తున్నారు. ఐఐఐటీ బెంగళూరులో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, చెన్నై మ్యాథమెటికల్ ఇన్ స్టిట్యూట్ కు ట్రస్టీ గానూ వ్యవహరిస్తున్నారు.1981 జూలైలో ఇన్ఫోసిస్ ను నారాయణమూర్తి, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, ఎస్డీ శిబులాల్, కె.దినేష్, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా స్థాపించారు.

Tags:    

Similar News