కొత్త చరిత్ర... అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువ్యక్తి!
ఇటీవల కాలంలో భారతీయులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో భారతీయులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని టాప్ ఐటీ కంపెనీలకు సీఈఓలుగా, శాస్త్రవేత్తలుగా, ప్రపంచ స్థాయి వైద్యులుగా, ఐటీ ప్రొఫెషన్ల్స్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక తెలుగు వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ఈ రకంగా అతడు రికార్డ్ సృష్టించబోతున్నారు! ఇప్పటివరకు తెలుగువారు ఎవరూ స్పేస్ లో అడుగుపెట్టకపోగా.. తొలిసారి గోపిచంద్ తోటకూర వెళ్లి రికార్డు సృష్టించనున్నారు.
అవును.. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. ఈ విషయాన్ని "బ్లూ ఆరిజిన్" అనే సంస్థ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి అమెజాన్ ఫౌండర్, జెఫ్ బెజోస్ కు చెందిన "బ్లూ ఆరిజిన్" అనే స్పేస్ కంపెనీ.. ఇప్పటికే "న్యూ షెపర్డ్ మిషన్" పేరిట స్పేస్ యాత్రలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటికే 2021లో జెఫ్ బెజోస్ సహా ముగ్గురు పర్యాటకులు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇక తర్వాత బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న ఎన్.ఎస్.-25 మిషన్ కు గోపీచంద్ తోటకూర సహా మొత్తం ఆరుగురు వ్యక్తులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్పందించిన గోపీచంద్.. బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించే వరకు తన కుటుంబానికి సైతం ఈ విషయం తెలియదని ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ వెల్లడించారు.
ఇందులో భాగంగా గోపీచంద్ తో పాటు... వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ లు ప్రయాణించనున్నారు.
వాస్తవానికి బ్లూ ఆరిజిన్ ఇప్పటి వరకు ఆరు మిషన్లలో 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లగా... వీరంతా సముద్రమట్టానికి 80-100 కిలోమీటర్ల ఎగువన ఉండే కర్మన్ లైన్ వరకు వెళ్లి వచ్చారు. మొత్తం 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగనుండగా.. ధ్వని వేగానికి మూడు రెట్ల వేగంతో వీరు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి భూగోళాన్ని వీక్షించి మెల్లగా కిందకు వస్తూ పారాచూట్ల సాయంతో క్యాప్స్యూల్ లో కిందకి దిగుతారు.
కాగా.. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం... కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు కాగా... భారత తొలి స్పేస్ టూరిస్ట్ గా తాజాగా గోపీచంద్ చరిత్ర సృష్టించనున్నారు.