బుచ్చయ్యదే తొలి విక్టరీ...మినిస్టర్ బెర్త్ గ్యారంటీ !
ఆ తరువాత ఈవీఎంలను తీస్తే అందులో కూడా భారీ మెజారిటీలతో బుచ్చయ్య చౌదరి దూసుకెళ్ళారు.
తూర్పున విజయం ఎపుడూ అధికారాన్ని తెస్తుంది. అందులోనూ రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ మోస్ట్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ కూటమికి విజయం దారి చూపించారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ని ఓపెన్ చేయడం నుంచి మొదలెడితే అందులో బ్రహ్మాండమైన మెజారిటీని సాధించారు. ఆ తరువాత ఈవీఎంలను తీస్తే అందులో కూడా భారీ మెజారిటీలతో బుచ్చయ్య చౌదరి దూసుకెళ్ళారు.
ఇక ఆయన ఎక్కడా ఆగలేదు. తిరుగులేని ఆధిక్యతతో కొనసాగి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో తొలి విజయం ఖరారు చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి 62 వేల భారీ ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని పరాజయం బాటను పట్టించారు.
ఇదిలా ఉంటే అన్న ఎన్టీయార్ స్థాపించిన టీడీపీలో ఆరంభం నుంచి ఉంటూ వచ్చిన బుచ్చయ్య చౌదరి ఇప్పటికి ఈ ఎన్నికతో కలుపుకుని ఏడు సార్లు గెలిచినట్లు అయింది. ఆయన గతంలో ఒకసారి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు
ఈసారి ఆయన ఘన విజయం నేపధ్యంలో బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి తధ్యమని అంటున్నారు. ఆయనకు ఉన్న విశేష రాజకీయ అనుభవం, సీనియారిటీ అన్నీ కలసి ఈసారి మంచి శాఖకు మంత్రిగా చేస్తారు అని అంటున్నారు.
చంద్రబాబు సైతం బుచ్చయ్యచౌదరి పట్ల పూర్తి విశ్వాసం ఉంచి పొత్తులో ఆయనకే సీటు దక్కేలా చూసారు. దానిని నిలబెట్టుకున్న బుచ్చయ్య చౌదరి చరిత్ర తిరగరాసేలా బ్రహ్మాండమైన మెజారిటీని సాధించారు. దాంతో బుచ్చయ్యకు కచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని ఆయన అనుచరులు బల్ల గుద్ది చెబుతున్నారు.
గత నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీకి విధేయుడుగా ఉంటూ వచ్చిన బుచ్చయ్య చౌదరికి ఈసారి ఎన్నికలు అతి కీలకంగా ఉన్నాయి. దాంతో ఆయన గెలిచి తానేంటో చూపించారు. దాంతో బుచ్చయ్య చౌదరి కాబోయే మంత్రి అని ఆయన అనుచర వర్గం గట్టిగా చెబుతోంది. చూడాలి మరి బుచ్చయ్య మంత్రిగా ఏ శాఖలను స్వీకరిస్తారో.