గౌతు ఫ్యామిలీ రాజకీయం ముగించాలన్నదే పంతం...!
శ్రీకాకుళం జిల్లాలో గౌతు ఫ్యామిలీకి రాజకీయంగా సామాజికంగా కూడా విశేష ప్రాధాన్యత ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో గౌతు ఫ్యామిలీకి రాజకీయంగా సామాజికంగా కూడా విశేష ప్రాధాన్యత ఉంది. ఆ కుటుంబానికి రాజకీయ ప్రజా జీవితంలో దాదాపుగా ఎనభై ఏళ్ల చరిత్ర ఉంది. తొలి తరంలో పోరాట యోధుడు బీసీ నేతగా ఉన్న వారు సర్దార్ గౌతు లచ్చన్న. ఆయన బ్రిటిష్ వారి హయాంలోనే పోరాటాలు చేసిన యోధుడు. ఆయన మూడున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు చేశారు.
ఆయన రాజకీయ వారసుడిగా ఉన్న గౌతు శ్యామసుందర శివాజీ కూడా తండ్రి బాటలోనేనే సోంపేట నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత టీడీపీలో మంత్రి పదవిలో కూడా కొనసాగారు. సోంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో పలాసగా మారింది. దాంతో 2009లో ఓడిన శివాజీ 2014లో తిరిగి గెలిచారు. 2019లో ఆయన రాజకీయ వారసురాలిగా ఉన్న గౌతు శిరీష తొలిసారి పోటీ చేసి మొదటి ఎన్నికలోనే ఓటమి పాలు అయ్యారు.
అయితే ఈసారి తప్పకుండా గెలవాలని ఆమె చూస్తున్నారు. వైసీపీ వైపు నుంచి చూస్తే మంత్రి సీదరి అప్పలరాజు ఉన్నారు. ఆయన మొదటిసారి 2019లో పోటీ చేసి గౌతు శిరీషను ఓడించడమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. ఈసారి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు.
అయితే గతంతో పోలిస్తే పలాసలో టీడీపీ గ్రాఫ్ పెరిగింది. దానికి తోడు జనసేన కూడా పొత్తులో ఉండడంతో టీడీపీ గెలుపు అవకాశాలు పెరిగాయని అంటున్నారు. గత ఎన్నికల్లో పదహారు వేల ఓట్ల తేడాతో సీదరి టీడీపీని ఓడించారు. ఆ ఎన్నికల్లో జనసేనకు ఆరు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వైసీపీకి ఈ సీటు మీద ధీమా ఉంది.
టీడీపీ జనసేన కలసినా పదివేల ఓట్ల మొగ్గు తమకే ఉంటుందని ఆ పార్టీ చెబుతోంది. అయితే యాంటీ ఇంకెంబెన్సీ ఓటు ప్రభావం చూపిస్తే ఫలితం తారు మారు అవుతుందని పైగా జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని, టీడీపీ కూడా బలపడిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఈ పరిణామాలను నిశితంగా వైసీపీ అధినాయకత్వం గమనిస్తోంది. పలాసలో మళ్ళీ గెలిస్తే కనుక ఇక ఆ సీటు వైసీపీ పరం అవుతుంది. రాజకీయంగా గౌతు కుటుంబం అంతం అవుతుంది. ఆ దెబ్బ తీయడానికే వైసీపీ హై కమాండ్ చూస్తోంది అని అంటున్నారు. సీదరి గట్టి ఫైట్ ఇవ్వకపోతే మాత్రం మరో బలమైన అభ్యర్ధిని సామాజిక సమీకరణలు సరిచూసుకుని మరీ పెట్టాలన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది.
గతంలో ఎలా అనూహ్యమైన తీరులో సీదరిని తెచ్చి విక్టరీ కొట్టారో అదే తీరున ఈసారి కూడా ఘన విజయం సాధించేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పక్కాగా గెలిచే సీట్లలో ఒకటిగా ఉన్న పలాసను ఎట్టి పరిస్థితులలో జారవిడుచుకోరాదని వైసీపీ భావిస్తోందిట. మరి గౌతు ఫ్యామిలీకి టఫ్ గా ఈ ఎన్నికలు మారనున్నాయి. గెలిస్తే గౌతు మూడవ తరం రాజకీయంగా నిలబడినట్లే.లేకపోతే మాత్రం సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ ఫ్యామిలీ రాజకీయంగా తెర మరుగు అయినట్లే అని అంటున్నారు.