గుడివాడకు నో సీటు...తేల్చేసిన జగన్...!?
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాధ్ కి ఈసారి ఎన్నికల్లో సీటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చేశారా అంటే జవాబు అవును అనే వస్తోంది
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాధ్ కి ఈసారి ఎన్నికల్లో సీటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చేశారా అంటే జవాబు అవును అనే వస్తోంది. గుడివాడ అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో జగన్ వేవ్ లో ఆయన గెలిచారు. అయిదేళ్ల కాలంలో ఆయన అనకాపల్లిలో తనకంటూ స్ట్రాంగ్ బేస్ ని నిర్మించుకోలేకపోయారు అన్న మాట ఉంది.
దానికి తోడు ఒక బలమైన సామాజిక వర్గం అక్కడ ఆయనను వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలతో పాటు జనంలో వచ్చిన వ్యతిరేకత సర్వేలలో వచ్చిన నివేదికలు అన్నీ చూసి ఆయనకు టికెట్ లేదని చాలా కాలం క్రితమే చెప్పేశారు. ఆయన ప్లేస్ లో అనకాపల్లి అసెంబ్లీకి ఇంచార్జిగా మలసాల భరత్ కుమార్ అనే యువకుడికి చాన్స్ ఇచ్చారు.
ఇక గురువారం అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి గుడివాడను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. అనకాపల్లిలో భరత్ ని గుడివాడ దగ్గరుండి గెలిపించాలని ముఖ్యమంత్రి వేదిక మీద నుంచే సూచించారు. అంతే కాదు భరత్ గుడివాడ ఇద్దరూ తనకు అన్నదమ్ములే అని అన్నారు. ఈ ఇద్దరూ కష్టపడి పనిచేయాలని పార్టీని గెలిపించుకుని వస్తే అన్నీ తాను చూసుకుంటాను అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
దాంతో గుడివాడకు ఈసారి ఎక్కడా టికెట్ లేదని తేలిపోయింది అని అంటున్నారు. నిజానికి అనకాపల్లి కాకపోయినా పెందుర్తి, ఎలమంచిలి, లేదా గాజువాక చోడవరం వీటిలో ఎక్కడో ఒక చోట తనకు టికెట్ వస్తుందని గుడివాడ భావించారు. అదీ కాదు అనుకుంటే అనకాపల్లి ఎంపీ సీటుకు అయినా పోటీకి పెడతారు అని కూడా అనుకున్నారు. కానీ జగన్ మనసులో మాటగా వేదిక మీద చెప్పేసరికి ఇక గుడివాడ పోటీ లేదు అని స్పష్టం అయింది అంటున్నారు.
దీనికి ముందే ఊహించిన గుడివాడ అమర్నాధ్ కూడా జగన్ ముందే సభలో మాట్లాడుతూ తనకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ గెలుపు కోసం పనిచేస్తాను అని హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లూ వైసీపీ గెలిచేలా చూస్తాను అని గుడివాడ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ రెండవసారి ప్రమాణం చేయడం అన్నది చారిత్రక అవసరం అని కూడా మంత్రి పేర్కొన్నారు. మొత్తానికి టీడీపీ నుంచి 2007లో కార్పోరేటర్ గా గెలిచి 2012 వరకూ ఆ పార్టీలో ఉన్న గుడివాడ ఆ మీదట వైసీపీలో చేరి 2014లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు, ఓటమి పాలు అయ్యారు.
ఇక 2019లో ఆయన ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. కీలకమైన అయిదు మంత్రిత్వ శాఖలు ఇచ్చినా అందులో ఆయన తనదైన పనితనం చూపించలేదని విమర్శలు ఉన్నాయి. అలాగే విపక్షాలు భూకబ్జా ఆరోపణలు చేస్తున్నాయి. వీటిని మంత్రి ఖండించినా వాస్తవాలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు కాబట్టే ఆయనను ఎన్నికలకు దూరం పెట్టారు అని కామెంట్స్ వస్తున్నాయి.