కోడి గుడ్డూ..ముద్దపప్పు...సరికొత్త వివాదం...!

ఎవరు ముద్ద పప్పు, ఎవరు కోడి గుడ్డు అంటే నాయకులకు నిక్ నేమ్ పెట్టేసే సోషల్ మీడియా ఉంది

Update: 2024-02-22 15:24 GMT

ఎవరు ముద్ద పప్పు, ఎవరు కోడి గుడ్డు అంటే నాయకులకు నిక్ నేమ్ పెట్టేసే సోషల్ మీడియా ఉంది. దాన్ని పంచ్ లుగా చేస్తూ ప్రత్యర్ధుల మీద అటాక్ చేసే నాయకులు ఉన్నారు. దాంతో అసలు పేరుకు కొసరు పేరుని తగిలిస్తూ ప్రధాన పార్టీల నేతలు సరికొత్త వివాదానికి తెర తీస్తున్నారు.

అసలే ఎన్నికల వేడి దాంతో ఏ చిన్న విషయం అయినా కూడా అతి పెద్ద వివాదంగా మారిపోతోంది. ఇటీవల విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ శంఖారావం సభలో మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని కోడిగుడ్డు మంత్రి అని సంబోధించారు. ఆయనకు నా గిఫ్ట్ అంటూ సభా వేదిక మీదనే గుడ్డుని చూపించారు. దాన్ని జాగ్రత్తగా మంత్రికి అందచేయమని తన పార్టీ నేతలకు సూచించారు.

కోడి గుడ్డు మంత్రిగా గుడివాడ పేరు తెచ్చుకున్నారు తప్ప ఆయన శాఖ ద్వారా ఏపీకి జిల్లాకు ఒక్క పరిశ్రమ అయినా తేలేకపోయారు అని లోకేష్ విమర్శించారు. ఇక దానికి గుడివాడ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్రా ఉప్పూకారంతో తయారు చేసిన పప్పు ముంతను లోకేష్ కి పంపుతున్నానని గుడివాడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు.

ఈ వివాదం ఇపుడు వైసీపీ టీడీపీ క్యాడర్ ల మధ్య కొత్త చిచ్చుని రగిల్చింది. మంత్రి గుడివాడ ఫ్లెక్సీని విశాఖలోని సిరిపురం జంక్షన్ లో ఉంచి మరీ దానిని కోడి గుడ్లతో తెలుగుదేశం కార్యకర్తలు కొట్టారు. రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యలు దారుణం అని వారు విమర్శించారు. లోకేష్ ని అనే స్థాయి మంత్రి అమర్ కి లేనే లేదని కూడా అన్నారు.

ఇక వైసీపీ ఊరుకుంటుందా. ఆ పార్టీ నేతలు కూడా విశాఖలో మరో చోట లోకేష్ ఫ్లెక్సీలను పెట్టి దానికి పప్పుతో అభిషేకం చేశారు. పప్పు ముద్దలతో నారా లోకేష్ ఫ్లెక్సీలను కొడుతూ టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలా ఒకే రోజున రెండు పార్టీల క్యాడర్ రోడ్డు మీదకు వచ్చి కీలక నేతల ఫ్లెక్సీలను ముందు పెట్టి మరీ ఇలా రచ్చ చేయడం సంచలనం రేపింది.

మంత్రి ఫ్లెక్స్కీ మీద కోడి గుడ్లతో కొట్టేందుకు పెద్ద ఎత్తున కోడి గుడ్లను టీడీపీ తెప్పిచింది. రోడ్ల మీద కోడి గుడ్లను ఇలా వృధాగా పడేసే బదులు నిరసన తెలియచేస్తూనే పేదలకు ఇస్తే ఎంతో బాగుండేది కదా అని అంటున్నారు. అలాగే పప్పుని వండించి తెచ్చి వైసీపీ నేతలు లోకేష్ ఫ్లెక్సీ మీద కొట్టడం కంటే పేదలకు దాన్ని ఆహారంగా ఇస్తే అది కూడా ఒక మంచి నిరసనగా మారేది గా అని సూచించే వారూ ఉన్నారు. అయితే రాజకీయాలలో ఫైర్ ఇలాగే రగులుతుంది. దాంతో కోపాలను ఫ్లెక్సీల మీద తీర్చుకుంటారు. ఆహార పదార్ధాలను వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఎన్నికల ముందు మరెన్ని చిత్రాలు చూడాల్సి ఉంటుందో అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News