వైసీపీలో మాజీ మంత్రి గడబిడ ?

వైసీపీ అసలే ఓటమి పాలు అయి కునారిల్లుతోంది. దాంతో పాటుగా పార్టీలో వర్గ పోరు మరింతగా కృంగదీస్తోంది

Update: 2024-07-11 04:12 GMT

వైసీపీ అసలే ఓటమి పాలు అయి కునారిల్లుతోంది. దాంతో పాటుగా పార్టీలో వర్గ పోరు మరింతగా కృంగదీస్తోంది. వైసీపీలో ఓడాక కూడా నేతల తీరు మారలేదు అని అంటున్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయని అంటున్నారు.

వారే అవంతి శ్రీనివాసరావు, అలాగే గుడివాడ అమర్నాధ్. ఇక రూరల్ లో చూసుకున్నా చాలా మంది సీనియర్ నేతలు అమర్నాథ్ ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ఆయన మంత్రిగా ఉన్నపుడు ఒంటెద్దు పోకడలు పోయారని దాని ఫలితం కూడా వైసీపీ అనుభవించాల్సి వచ్చిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 మధ్యలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా గుడివాడ అమర్నాధ్ పగ్గాలు అందుకుని పాలించారు. ఇపుడు కూడా ఆయన పార్టీ ప్రెసిడెంట్ కావాలని అనుకుంటున్నారు. ఆయనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆయన అనుచరులు కొందరు మీడియా ముందుకు వచ్చి కోరుతున్నారు.

మరో వైపు చూస్తే గుడివాడకు బాధ్యతలు అప్పగించవద్దని అందరికీ ఆమోదయోగ్యమైన వారికే ఈ బాధ్యతలు ఇవ్వాలని కూడా సీనియర్లు కొంతమంది కోరుతున్నారు. ఇక గుడివాడ అమర్నాధ్ అయితే జిల్లా ప్రెసిడెంట్ పదవితో పాటు లోకల్ బాడీస్ ద్వారా వైసీపీకి దక్కే ఎమ్మెల్సీ పదవి మీద కన్నేశారు అని అంటున్నారు.

ఈ పదవిలో ఉంటూ జనసేనకు జంప్ అయిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ విశాఖ సౌత్ నుంచి గెలిచారు దాంతో ఈ సీటు ఖాళీ అయింది. దాంతో తొందరలో లోకల్ బాడీస్ ద్వారా ప్రజా ప్రతినిధులు ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ పోస్టుని గుడివాడ ఆశిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

వైసీపీకి విశాఖ కార్పోరేషన్ లోనూ జిల్లా పరిషత్ లోనూ భారీ మెజారిటీ ఉంది. అలాగే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆ పార్టీ వారే ఎక్కువ మంది ఉన్నారు. దాంతో ఈ ఎమ్మెల్సీ సీటుని గెలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. గుడివాడ ఎమ్మెల్సీ ద్వారా నెగ్గి ఆ మీదట ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ ప్రెసిడెంట్ గా పార్టీ పదవిని అందుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఈ రెండు పదవులూ ఆయనకు దక్కకుండా పావులు కదుపుతున్న వారు వైసీపీలోనే ఉన్నారు. గుడివాడ వల్ల గతంలో పార్టీలో ఇబ్బందులు వచ్చాయని సీనియర్లు పార్టీని వీడిపోయారని అందువల్ల సమర్ధ నేతకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవిని కొత్త వారికి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కోరుతున్నారు.

వైసీపీ అధినాయకత్వం దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గుడివాడ అయితే జగన్ కి అత్యంత సన్నిహితులు కాబట్టి ఆయన వైపు మొగ్గు చూపుతారా అన్న చర్చ ఉంది. మరి గుడివాడకే కీలక బాధ్యతలు అప్పగిస్తే విశాఖ జిల్లాలో వైసీపీని ఆయన ఒడ్డున పడేయగలరా పార్టీని ఏక త్రాటి మీద నడిపించగలరా అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News