గుడివాడ‌లో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నాయ‌కుల మ‌ధ్య త‌లెత్తిన పోటా పోటీ వాతావ‌ర‌ణం.

Update: 2024-01-18 09:50 GMT

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నాయ‌కుల మ‌ధ్య త‌లెత్తిన పోటా పోటీ వాతావ‌ర‌ణం.. నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. తెలుగు దేశంపార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ సీఎం దివంగత నంద‌మూరి తార‌క‌రామారావు వర్ధంతిని పుర‌స్క‌రించు కుని ఈ రెండు పార్టీలూ పోటా పోటీగా కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాయి. గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు, టీడీపీ మాజీ నేత కొడాలి నాని.. అన్న‌గారి వ‌ర్ధంతిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఇక‌, టీడీపీ కూడా ఈ ద‌ఫా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. నిజానికి ఏటా ఈ రెండు వ‌ర్గాలు అన్న‌గారి వ‌ర్ధంతిని నిర్వ‌హిస్తున్నా.. ఈ ఏడాది మాత్రం చాలా ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. దీనికి కార‌ణంగా.. అసెంబ్లీ ఎన్నిక‌లే. త‌మ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కాలు దువ్వుతున్న కొడాలి నానిని నిలువ‌రించాల‌నే వ్యూహంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ ద‌ఫా కూడా టీడీపీని ఓడించాలని కొడాలి నాని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

దీంతో ఎన్టీఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని కొడాలి నాని కూడా సీరియ‌స్‌గా తీసుకున్నారు. పైగా శుక్ర‌వారం టీడీపీ.. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో రా..క‌ద‌లిరా! బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఈ స‌భ‌లు నిర్వ‌హిస్తున్నా.. ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌.. గుడివాడ‌లో ఆయ‌న వ‌ర్ధంతి రోజే నిర్వ‌హించడం..పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డం వంటివి ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. దీంతో టీడీపీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ వెనిగండ్ల రాము.. అటు వ‌ర్ధంతిని.. ఇటు రా.. క‌ద‌లిరా! స‌భ‌ను విజ‌యవంతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే.. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌కు పోటీగా ఎమ్మెల్యే కొడాలి నాని ప్ర‌య‌త్నాలుముమ్మ‌రం చేశారు. నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా త‌న అనుచ‌రుల‌తో బైకు ర్యాలీలు నిర్వ‌హించారు. అన్న‌గారి విగ్ర‌హాల‌కు టీడీపీ క‌న్నా ముందే.. పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. పైగా.. సాయంత్రం తాను కూడా స‌భ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో అటు టీడీపీ, ఇటు నాని వ‌ర్గాల మ‌ధ్య దూకుడు పెరిగింది. ఏక్ష‌ణంలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. మ‌రోవైపు.. జిల్లా పోలీసులు 1000 మంది సిబ్బందిని త‌ర‌లించి భ‌ద్ర‌త క‌ల్పించారు.

Tags:    

Similar News