ఫుట్ బాల్ మ్యాచ్ లో ఫ్యాన్స్ మధ్య ఘర్షణ.. 100 మంది మృతి!
అవును.. మన దేశంలో క్రికెట్ ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఫుట్ బాల్ క్రీడను అంతకు మించి అన్నట్లుగా ప్రేమిస్తారు.
అవును.. మన దేశంలో క్రికెట్ ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఫుట్ బాల్ క్రీడను అంతకు మించి అన్నట్లుగా ప్రేమిస్తారు. ఫుట్ బాల్ మీద ఉన్న క్రేజ్ తెలిస్తే.. నోట మాట రాదంతే. తాజాగా చోటు చేసుకున్న అత్యంత విషాద ఉదంతం ఆ కోవకు చెందిందే. ఫుట్ బాల్ ను అమితంగా ప్రేమించే ఒక దేశంలో జరిగిన మ్యాచ్ లో అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు ఏకంగా 100 మంది ప్రాణాలు విడిచే ఘోర విషాదం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇంతటి విషాదం ఎక్కడ చోటు చేసుకుంది? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్న వివరాల్లోకి వెళితే..
పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది. ఒక ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ.. తీవ్ర హింసకు కారణమైంది. పరస్పరం దాడి చేసుకున్న ఈ ఉదంతంలో వంద మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గినియా దేశంలో రెండో అతి పెద్ద నగరం జెరెకొరె. గినియా మిలిటరీ నేత మమాడి దౌంబోయ గౌరవార్థం ఆదివారం ఒక ఫుట్ బాల్ మ్యాచ్ ను నిర్వహించారు.
మ్యాచ్ లో భాగంగా రిఫరీ తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదమైంది. రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఒక జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది. వేలాది మంది అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి దాడులు చేసుకోవటంతో ఫుట్ బాల్ గ్రౌండ్ మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ ఘర్షణ అంతకంతకూ విస్తరించి.. వేలాది మంది అభిమానులు రోడ్ల మీదకు వచ్చారు. ఎదుటి జట్టు అభిమానులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసినా డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆట మీద అభిమానం ఉండొచ్చు. మరీ ఇంతనా? అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం వంద మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.