ట్రంప్ పై కాల్పుల వేళ ప్రత్యక్ష సాక్ష్యులు ఏమంటున్నారు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన షాకింగ్ గా మారింది
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన షాకింగ్ గా మారింది. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. రక్తం కారుతున్న ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించటం తెలిసిందే. ఈ ఘటనతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తవుతోంది. అయితే.. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లు మాత్రం ఆయన క్షేమంగా ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాల్పుల జరిగిన నిమిషం వ్యవధిలోనే ట్రంప్ ఆ షాక్ నుంచి తేరుకోవటం గమనార్హం. అంతేకాదు..కాల్పుల వేళ.. ట్రంప్ చెవి వెనుకకు బుల్లెట్ దూసుకెళ్లిన రెండు సెకన్ల వ్యవధిలోనే ట్రంప్ స్పందించారు. వెంటనే చేతిని చెవి వెనక్కి పెట్టుకున్న ఆయన.. సెకన్ కంటే తక్కువ వ్యవధిలోనే రియాక్టు అయ్యారు. వెంటనే కిందకు వంగారు. ఆ వెంటనే ఆయన పక్కనున్న భద్రతా సిబ్బంది స్పందించి.. ఆయన్ను చుట్టేసి.. రక్షణగా నిలిచారు.
నిజానికి కాల్పుల వేళ తొలుత స్పందించింది ట్రంపే. ఆయన రియాక్షన్ చూసిన తర్వాత కానీ.. అక్కడున్న వారికి ఏదో జరిగిందన్నది అర్థమైంది. ఆ వెంటనే వరుస పెట్టి కాల్పుల మోత మోగుతుండటంతో అక్కడున్న వారంతా కిందకు వంగేశారు. హాహాకారాలు చేశారు. ఈ ఉదంతంపై అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు పలువురు స్పందించారు. కొందరు తాము చూసిన ఈ షాకింగ్ ఉదంతం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
‘‘వరుసగా పిస్టల్ కాల్పుల శబ్దాలు వినిపించాయి’’ అని ఒకరు పేర్కొంటే.. ట్రంప్ ను స్టేజి నుంచి దింపటం చూశాను. ఒక్కసారిగా అక్కడ జనం గుమిగూడారు. అంతా గందరగోళంగా కనిపించిందని మరొకరు పేర్కొన్నారు. తన తండ్రిపై జరిగిన కాల్పుల ఘటనపై ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ స్పందించారు. ‘‘వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ డిపార్ట్ మెంట్ కు.. ఇతర అధికారులకు థ్యాంక్స్. నా దేశం కోసం నేను ప్రార్థిస్తూనే ఉంటాను. ఐలవ్యూ డాడ్. టుడే అండ్ ఆల్వేస్ (ఈరోజు.. ఎల్లప్పుడూ) అంటూ ఇవాంకా ట్వీట్ చేశారు.