ఆస్పత్రిని అలా వాడేస్తున్న హమాస్... ఐడీఎఫ్ వీడియో వైరల్!
ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) గాజాపై వణికించేస్తుంది. బందీలను విడిపించడమే లక్ష్యంగా భూతలదాడులు చేస్తుంది.
ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) గాజాపై వణికించేస్తుంది. బందీలను విడిపించడమే లక్ష్యంగా భూతలదాడులు చేస్తుంది. ఈ సమయంలో గతకొన్ని రోజులుగా ఇజ్రాయేల్ ఆరోపిస్తున్నట్లు ఆస్పత్రులే హమాస్ స్థావారాలుగా మారాయని.. వాటికింద ఉన్న సొరంగలకు ఎంట్రీ ఈ ఆస్పత్రులే అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూర్చే వీడియో విడుదల చేసింది ఐడీఎఫ్.
అవును... గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాను.. హమాస్ మిలిటెంట్లు తమ ప్రధాన కమాండ్ సెంటర్ గా వాడుకుంటున్నారని చెబుతున్న ఇజ్రాయెల్.. అందుకు బలమైన సాక్ష్యాలను బయటపెడుతోంది. ఇందులో భాగంగా... తాజాగా ఈ ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఐడీఎఫ్.. ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
ఈ వీడియోలో... అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడి అనంతరం ఆ దేశం నుంచి కిడ్నాప్ చేసిన కొంతమందిని అల్-షిఫాలో బందించేందుకు తీసుకురావడం స్పష్టంగా కన్పించింది. అక్టోబరు 7న ఉదయం 10:42 నుంచి 11 గంటల మధ్య అల్-షిఫా ఆస్పత్రి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను ఇజ్రాయేల్ సైన్యం విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో సంచలనంగా మారింది.
ఈ వీడియోలో... చేతిలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లు.. ఓ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కొస్తున్నట్లుగా ఉంది. ఇదే సమయంలో... అత్యంత తీవ్రంగా గాయపడిన మరో బందీని స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తున్నట్లుగా వీడియోలో ఉంది. దీంతో... ప్రపంచం ముందు హమాస్ దుశ్చర్యలను, తమ వాదనను ఇజ్రాయేల్ మరోసారి సాక్ష్యాలతో నిరూపించినట్లయ్యిందని అంటున్నారు.
ఆన్ లైన్ వేదికగా ఈ వీడియో విడుదల అనంతరం ఐడీఎఫ్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ స్పందించారు. ఆ వీడియోలో కనిపిస్తున్న బందీలు నేపాల్, థాయ్ లాండ్ దేశస్థులని తెలిపారు. అయితే ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు.. అసలు వారి పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం ఇంకా తెలియలేదని తెలిపారు.
అయితే ఈ వీడియో ఫుటేజ్ చూసినవారెవరికైనా... ఇజ్రాయెల్ పై నరమేధం జరిపిన రోజున అల్-షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు వినియోగించుకున్నారని మాత్రం స్పష్టమవుతుందని వెల్లడించారు.
31 మంది శిశువుల తరలింపు:
హమాస్ ఉగ్రవాదులు అల్–షిఫా ఆస్పత్రిని తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ ఇజ్రాయేల్ సైన్యం.. వారం క్రితమే ఆ హాస్పటల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయమంలో ఆ ఆసుపత్రిలో శిశువుల దీనస్థితి చర్చనీయాంశం అవుతుంది. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్ కు ప్రపంచం విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ విషయంపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది.
ఇందులో భాగంగా నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.