ఫ్లెక్సీల కలకలం.. మండలి హన్మంతరావు వెర్షన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించి గుడివాడలో కొడాలి నానికి సీటు లేదని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించి గుడివాడలో కొడాలి నానికి సీటు లేదని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానికి గెలుపు అవకాశాలు లేవని ఈ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కొడాలి నానిని పక్కనపెట్టి ఆయన స్థానంలో కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మండలి హన్మంతరావుకు సీటు ఇస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఈ మేరకు మండలి హన్మంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ గుడివాడ పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. మండలి హన్మంతరావు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లపై దివంగత నేత వంగవీటి మోహన్ రంగా ఫొటో, వైఎస్సార్, వైఎస్ జగన్ చిత్రాలను ముద్రించారు. వీటిపై ఎక్కడా కొడాలి నాని ఫొటో లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
మండలి హన్మంతరావుకు సీటు కన్ఫామ్ కాకుండా ఆయన పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరని.. వీటిని బట్టి ఆయనకే సీటు ఇస్తున్నారని ఓ వర్గం మీడియా కథనాలను అచ్చేసింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఎవరికి సీటు ఇవ్వాలనేది వైఎస్ జగన్ ఇష్టమన్నారు. అంతేకానీ ఎల్లో మీడియా అధినేతలు చెప్పినవారికి జగన్ సీటు ఇవ్వరని తేల్చిచెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
కొడాలి నాని గుడివాడ నుంచి 2004, 2009ల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. 2014, 2019ల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కొడాలి నానిని మంత్రిపదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి గతంతో పోలిస్తే కొడాలి నాని యాక్టివ్ గా ఉండటం లేదని వార్తలు వచ్చాయి. మధ్యలో ఆయన అనారోగ్యం పాలయ్యారనే వార్తలు కూడా హల్చల్ చేశాయి.
మరోవైపు గుడివాడలో వైసీపీ అభ్యర్థిని తానేనని జరుగుతున్న ప్రచారంపైన మండలి హన్మంతరావు కూడా స్పందించారు. తాను పోటీలో ఉన్నట్టు గత కొన్నిరోజులుగా తనపై సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నానితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తాను విశ్వాసపాత్రుడిగా ఉంటానని తెలిపారు.
పార్టీ లైనును, ఎమ్మెల్యే కొడాలి నానిని దాటి తానెప్పుడూ ముందుకు వెళ్లబోనని మండలి హన్మంతరావు స్పష్టం చేశారు. తనకు పదవి కావాలని, ఇతర ప్రయోజనాలు కావాలని ఎప్పుడూ ఆశించలేదన్నారు. ఈ మేరకు కొడాలి నానితో కలిసి మండలి హన్మంతరావు మీడియాతో మాట్లాడారు. దీంతో గుడివాడ వైసీపీ అభ్యర్థి మండలి హన్మంతరావు అనే వార్తలకు అడ్డుకట్ట పడినట్టయింది.