ఆ భయం జనసైనికుల్లో ఉంది.. జోగయ్య మరో సంచలన లేఖ!
టీడీపీని శాసించే స్థాయిలో ఉండి జనసేన 24 సీట్లకే పరిమితం కావడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
కాపు సంక్షేమ సేన సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరో లేఖను సంధించారు. జనసేన పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లే తీసుకోవడంపై జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పవన్ కు ఆయన లేఖ రాశారు. కనీసం అధికారంలో వాటా అయిన అడగాలని సూచించారు.
అయితే తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ–జనసేన జెండా సభలో తనకు ఎవరి సూచనలు, సలహాలు అవసరం లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా స్పందించిన పవన్.. తన సలహాలు, సూచనలు వద్దంటే తానేమీ చేస్తానని.. మీకో నమస్కారం పెట్టి.. మీ ఖర్మ అని వదిలేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. ఇక నేను సలహాలు, సూచనలు ఇవ్వనన్నారు.
ఇంతలోనే మరో లేఖను హరిరామజోగయ్య తాజాగా సంధించారు. టీడీపీని శాసించే స్థాయిలో ఉండి జనసేన 24 సీట్లకే పరిమితం కావడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారంలో పవన్ కల్యాణ్ కు దక్కే ప్రాధాన్యత ఏంటో తెలుసుకునేందుకు చంద్రబాబును వివరణ కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు.
జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు చూస్తున్నారనే భయం జన సైనికుల్లో ఉందన్నారు. పవన్ కు ఇష్టమున్న లేకపోయినా తాను చచ్చే వరకు జనసేన మేలుకోరి పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. 40 సీట్లు ఆశించిన జనసైనికులు 24 సీట్లు మాత్రమే తీసుకోవడంతో ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యమని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. వెన్నుపోటుకి అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరు నమ్ముతారని జోగయ్య సందేహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అని వైసీపీ నాయకులు విమర్శిస్తుంటే చంద్రబాబు, లోకేష్ నోరు ఎందుకు మెదపడం లేదని నిలదీశారు. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను నిర్వీర్యం చేయడమే టీడీపీ కుతంత్రమా అని ప్రశ్నించారు. మిత్రులు, ఎవరో శత్రువులు ఎవరు తెలుసుకుని పవన్ ప్రవర్తించడం మంచిదని హరిరామజోగయ్య హితవు పలికారు.