జోగయ్య పవన్ లైన్ లోకి వచ్చేశారా... !?

జనసేన చెవిలో జోరీగ మాదిరిగా పెద్దాయన కాపు నేత హరి రామ జోగయ్య ఉంటూ వచ్చారు.

Update: 2024-02-14 05:00 GMT

జనసేన చెవిలో జోరీగ మాదిరిగా పెద్దాయన కాపు నేత హరి రామ జోగయ్య ఉంటూ వచ్చారు. ఆయన వరసబెట్టి లేఖలు రాస్తూ జనసేన అధినేత పవన్ కి లేని పోని డిమాండ్లు పెడుతున్నారని కూడా అంతా అనుకున్నారు. అరవై సీట్లకు తగ్గకుండా సీట్లు పొత్తులో టీడీపీని అడగాలని జోగయ్య డిమాండ్ చేశారు. అలాగే ఏడు నుంచి తొమ్మిది దాకా ఎంపీ సీట్లు కోరాలని కూడా సూచించారు. కాపులకు రెండున్నరేళ్ల పాటు సీఎం సీటు కూడా షేర్ ఇవ్వాలని ఆయన మరో లేఖలో కోరారు

అలాంటి జోగయ్య ఈసారి పవన్ వైపు నుంచి తన లేఖాస్త్రాలను కాపు సోదరుల వైపు మళ్ళించారు కాపులకు మేలు కొలుపు అంటూ ఆయన రాసిన తాజా లేఖ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. పవన్ లైన్ లోనే జోగయ్య ఉంటూ రాసిన లేఖగా ఉంది. అందులో పవన్ ని నమ్మండి ఆయన వ్యూహాలను సందేహించవలదు. కాపులంతా ఐక్యంగా ఉండాలని జోగయ్య సూచించారు.

పవన్ అర్జునుడి మాదిరిగా విజయాలు సాధిస్తారని ఆయన ప్రతీ నిర్ణయంలో ఒక వ్యూహం ఉంటుందని జోగయ్య చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే జోగయ్య పవన్ ని ఇన్నాళ్ళకు అర్ధం చేసుకున్నారా లేక ఆయన కాపుల విషయంలో ఐక్యత కోసం ఈ లేఖ రాశారా అన్న చర్చ సాగుతోంది.

ఏది ఏమైనా జోగయ్య ఇటీవల కాలం వరకూ పవన్ ని ఇబ్బంది పెట్టేలాగానే లేఖలు రాశారు అని అంటారు. ఆయన మంచి కోసం రాసినా కూడా పొత్తు నేపధ్యంలో జనసేనకు ఇరకాటంగానే ఉంది. టీడీపీతో బేరమాడి ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం అయితే ఈ పరిస్థితుల్లో లేదు అన్నది ఒక మాట.

ఎంత కాదనుకున్నా టీడీపీ పెద్ద పార్టీ. నలభై శాతం ఓటు షేర్ ఉన్న పార్టీ. అలాంటి పార్టీ నుంచి ఎక్కువ సీట్లు సీఎం పోస్ట్ డిమాండ్ చేస్తే పొత్తుకే ఎసరు వస్తుందని కూడా అన్న వారూ ఉన్నారు. అయితే కాపులకు పవన్ సీఎం కావడం కావాలి. ఆ దిశగా అడుగులు వేద్దాం దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉందనే పవన్ చెప్పుకుంటూ వచ్చారు. నన్ను నమ్మండి ఈ ఒక్కసారి నా మీద మొత్తం భారం వేయండి అని పవన్ పార్టీ సమావేశాలలో పదే పదే చెపారు.

ఇపుడు చూస్తే జోగయ్య సైతం అదే మాట అంటూ లేఖ రాయడంతో జోగయ్య పవన్ లైన్ లో వెళ్తూ జనసేన పొత్తులకు ఎత్తులకు పూర్తిగా సహకరిస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఇక మీదట జనసేనకు పెద్దాయన నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది.

Tags:    

Similar News