జోగాయ్య లాస్ట్ లైన్ ఇదే...జనసేనాని ఓకేనా...!

జనసేనకు పూర్తి కాలం సలహాదారునిగా సీనియర్ నేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మారిపోయారు.

Update: 2024-02-16 03:45 GMT

జనసేనకు పూర్తి కాలం సలహాదారునిగా సీనియర్ నేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మారిపోయారు. ఆయన సలహా సూచనలకు చాలా విలువ ఉంది. ఎంతవరకూ అంటే ఆయన్ని స్వయంగా పవన్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని మరీ ఏకాంతంగా గంటల తరబడి భేటీలు వేసేవరకూ. పైగా కాపు నేత సీఎం కావాలని జోగయ్య కోరుకోవడం పవన్ కోసమే కాబట్టి ఆయనకు ఏమీ ఇబ్బంది లేదు.

అయితే పొత్తులకు జోగయ్య డిమాండ్లు ఎక్కడ చిక్కులు తెచ్చిపెడతాయో అన్న బెంగ మాత్రం సేనానికి ఉంటుంది. అయితే పలికేది జోగయ్య పలికించేది పవనుడు అని కూడా మరో టాక్ నడుస్తోంది. పవన్ మీద జోగయ్య పెట్టే వత్తిడితోనే చంద్రబాబు దగ్గర సీట్ల బేరం గట్టిగా ఆడగలను అని పవన్ కూడా భావిస్తే తప్పు లేదు. ఎందుకంటే ఎక్కువ సీట్లు సాధించడం పవన్ కి కూడా అవసరమే కదా.

దానికి ఆయన జోగయ్య లేఖలను కూడా ముందు పెట్టి అధిక సీట్లు కోరవచ్చు. ఇదిలా ఉంటే డెబ్బై అయిదుతో మొదలెట్టి అరవై దాకా అంటూ మాట్లాడి యాభై సీట్లకు తక్కువ వద్దు అని చెప్పిన జోగయ్య లాస్ట్ గా నలభై ఒక్క అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లు తీసుకోవాలని పవన్ ని కోరుతున్నారు. ఇది లేటెస్ట్ డిమాండ్. బహుశా లాస్ట్ లైన్ కూడా ఇదే అయి ఉండవచ్చు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే జోగయ్య కోరినట్లుగా పవన్ చంద్రబాబుని కోరినా నలభై ఒక్క సీట్లు టీడీపీ ఇస్తుందా అన్నదే చర్చ. అంతే కాదు ఆరు ఎంపీ సీట్లు జనసేనకు ఇస్తుందా అన్నది మరో డౌట్. ఇక జోగయ్య మాత్రం అదే పనిగా పవన్ కి సూచిస్తూ లేఖలు సంధిస్తూనే ఉన్నారు. కాపులు ఇతర బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న చోట సీట్లు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని ఆయన సూచించారు.

నర్సాపురం భీమవరం నుంచి పవన్ ని పోటీ చేయమని జోగయ్య కోరుతున్నారు. అంటే రెండు అసెంబ్లీ సీట్లలో అన్న మాట. అలాగే తిరుపతి నుంచి నాగబాబుని అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆయన మరో సూచన చేశారు

ఏపీలో కాపులు పావు వంతు జనాభా ఉన్నారని పవన్ కి ఆయన గుర్తు చేశారు. అంటే అయిదు కోట్ల మంది ఉన్న ఏపీలో కోటిన్నర మంది కాపు బాలిజ తెలగ ఒంటరి కులాలకు చెందిన సామాజిక వర్గం ఉందని ఆయన గుర్తు చేశారు.

ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఉండి అర్ధబలం అంగబలం ఉండి కూడా కాపులు ఎక్కువ సీట్లు తెచ్చుకుని పోటీ చేయకపోతే ఇబ్బందులే అని ఆయన హెచ్చరిస్తున్నారు. పొత్తులో చివరికి ఈ సీట్లు అయినా సాధించాలని జోగయ్య చేసిన విన్నపానికి పవన్ ఎలా రియాక్ట్ అవుతారు. చంద్రబాబు ఏ మేరకు సీట్లు ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News