హరీష్ రావు అరెస్టు...ఏం జరిగిందంటే ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ దాడి చేయడంతో గురువారమంతా తెలంగాణా రాజకీయ హాట్ హాట్ గా సాగింది.

Update: 2024-09-12 18:00 GMT

బీఆర్ఎస్ అగ్ర నేత మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ అయ్యారు. తెలంగాణా రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మంట రగులుతున్న నేపథ్యంలో హరీష్ రావు అరెస్ట్ కీలక పరిణామంగా చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ దాడి చేయడంతో గురువారమంతా తెలంగాణా రాజకీయ హాట్ హాట్ గా సాగింది.

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వైపు వెళ్ళిన గాంధీని కౌశిక్ రెడ్డి గట్టిగానే టార్గెట్ చేశారు. ఆయన మీద అనర్హత వేటు పడేలా పోరాటం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ సాగుతున్నాయి. అది పీక్స్ కి చేరి కౌశిక్ ఇంటి మీద దాడి చేశారు.

దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా అలెర్ట్ అయింది కేటీఆర్ నుంచి హరీష్ రావు వరకూ ఇదే ఇష్యూ మీద ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హరీష్ రావు బీఆర్ఎస్ నేతలతో కలసి సైబరాబాద్ సీపీ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు.

అక్కడ ఆందోళన చేయరాదని వెళ్ళిపోవాలని పోలీసులు కోరినా బీఆర్ఎస్ నేతలు తమ ఆందోళనను కొనసాగించడంతో పోలీసులు హరీష్ రావు తో సహా బీఆర్ఎస్ నేతలు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ వాహనం ఎక్కించారు. అనంతరం వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఇదిలా ఉంటే నేనేంటో చూపిస్తాను అని కౌశిక్ రెడ్డి తన ఇంటి మీద జరిగిన దాడికి ప్రతిగా సవాల్ చేయడంతో ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుందని అంటున్నారు. అంతే కాదు ఇది కొత్త మలుపు తీసుకుంటుంది అని అంటున్నారు.

బీఆర్ ఎస్ కి ఇది ఇపుడు పెద్ద ఇష్యూగా మారింది. విషయం ఏంటి అంటే ఆరికపూడి గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడే. అయినా ఆయన కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నారు. అందుకే ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి లభించింది. దాంతోనే బీఆర్ఎస్ కి మంటెత్తింది.

ఆయనకు ఎలా ఇస్తారు అని బీఆర్ ఎస్ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ మీద మాటలతో ఎటాక్ చేస్తూనే ఉంది. ఇక కౌశిక్ రెడ్డి అయితే దూకుడు పెంచారు. దాంతోనే ఇలా ఇంటి మీద దాడి లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇది బీఆర్ఎస్ లోనే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణగా భావిస్తోంది.

ఈ రోజుకీ టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడు ఆరికపూడి గాంధీ అని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ని ఈ ఇష్యూలోకి తెచ్చి రచ్చ చేయాలని బీఆర్ఎస్ చూస్తూంటే మరి రెండు ఆకులు ఎక్కువగా చదివిన కాంగ్రెస్ దీనిని లైట్ తీసుకుంటోంది. మొత్తానికి హరీష్ రావు అరెస్టు ద్వారా ఈ ఇష్యూకి హీట్ పెంచేశారు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News