ఉపాధి కోసం అడిగిన మహిళతో ఆ సీఎం అధికార బలుపు మాటలు

ఒక మహిళ చేసిన విన్నపానికి స్పందనగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.

Update: 2023-09-08 04:37 GMT

కొండ మీద కోతిని తీసుకురావాలని అడగలేదు. ఉచితాలు కోరలేదు. అడిగిందల్లా.. కాస్తంత పని చేసుకోవటానికి వీలుగా ఒక ఫ్యాక్టరీ పెట్టండి మహానుభావా అంటూ అడిగిన దానికి.. అందరి ముందు ఎటకారం ఆడేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హర్యానా రాష్ట్ర సీఎం చేసిన తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మండిపాటు వ్యక్తమవుతోంది. ఒక మహిళ చేసిన విన్నపానికి స్పందనగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఒక కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి.. అక్కడ చిన్నపాటి సభను నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున స్వయం సహాయక గ్రూపు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించారు. అనంతరం వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమైనా సందేహాలు ఉంటే అడగాలని కోరారు.

ఇందులో భాగంగా ఒక మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే.. అందులో పని చేయటానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి.. త్వరలో చంద్రుడి మీదకు మరో అంతరిక్ష నౌకని పంపుతారని.. అందులో నిన్ను కూడా పంపిస్తానంటూ ఎటకారంతో కూడిన అధికార బలుపును ప్రదర్శించారు. ఉపాధి అవకాశాల కోసం ముఖ్యమంత్రికి చేసిన ఒక మహిళ విషయంలో స్పందించాల్సిన తీరు ఇదేనా? అన్నది ప్రశ్నగా మారింది.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఆయన చేసిన వ్యాఖ్యల వీడి:యోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా.. ఆ తర్వాత మరోలా వ్యవహరిస్తారని.. అందుకు సీఎం తాజా వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏమైనా.. మాట్లాడే మాటలు మర్యాదపూర్వకంగా ఉండాలే తప్పించి.. ఎటకారాలు చేయటం ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News