ఎందుకలా? 2 తరగతి విద్యార్థికి స్కూల్లో గుండెపోటు

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ పట్టణంలోని ‘వాహిని’ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు ఎనిమిదేళ్ల చంద్రకాంత్.

Update: 2024-03-11 05:22 GMT
ఎందుకలా?  2 తరగతి విద్యార్థికి స్కూల్లో గుండెపోటు
  • whatsapp icon

అవును.. ఆ పిల్లాడికి 8ఏళ్లు. రెండో తరగతి చదువుతున్న ఈ పిల్లాడు స్కూల్లో హుషారుగా గెంతుతూ.. ఆడుకుంటున్న వేళ ఒక్కసారిగా కిందకు పడిపోవటం.. ఆ వెంటనే ప్రాణాలు పోవటం షాకింగ్ గా మారింది. అసలేమైందన్న టెన్షన్ ఒక ఎత్తు అయితే.. లక్కీగా స్కూల్ ఆవరణలో ఉన్న సీసీ కెమేరాల కారణంగా.. అతగాడి మరణంలోని మరో కోణం బయటకు వచ్చింది. మిగిలిన పిల్లలతో పాటు అప్పటివరకు హుషారుగా ఉండి.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

పోస్టుమార్టం రిపోర్టులో పిల్లాడు గుండెపోటుతో మరణించిన వైనం వెలుగు చూడటంతో పిల్లాడి తల్లిదండ్రులతో పాటు స్కూల్ యాజమాన్యం, మిగిలిన పిల్లల తల్లిదండ్రులకు కొత్త టెన్షన్ ను తెప్పిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారి ఇప్పుడు అందరికి కంగారు పెట్టేసేలా పరిస్థితి మారింది. ఇంతకూ ఈ అనూహ్య ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ పట్టణంలోని ‘వాహిని’ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు ఎనిమిదేళ్ల చంద్రకాంత్. ఇతను ఫిరోజాబాద్ లోని నాగ్లా పచ్చియాకు చెందిన పిల్లాడు. రోజూ మాదిరి శనివారం స్కూల్ కు వెళ్లాడు. లంచ్ టైంలో మిగిలిన పిల్లల మాదిరే స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నాడు. అలాంటిది ఒక్కసారిగా చంద్రకాంత్ నడుం చుట్టూ చేతులు వేసుకుంటే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న చిన్నారి కేకలు వేయటంతో స్కూల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

చంద్రకాంత్ ను పైకి లేపే ప్రయత్నం చేయగా.. అతగాడి నుంచి స్పందన లేకపోవటంతో హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి.. అతను చనిపోయిన విషయాన్ని వెల్లడించారు. దీంతో అందరూ షాక్ తిన్న పరిస్థితి. దీంతో.. అప్పటివరకు హుషారుగా ఉన్న పిల్లాడు అంతలా ఎలా మరణిస్తాడన్న ప్రశ్నతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. చంద్రకాంత్ ను పోస్టుమార్టం చేసిన వైద్యులు.. అతను గుండెపోటు కారణంగా మరణించిన విషయాన్ని వెల్లడించారు.

రెండో తరగతి చదివే పిల్లాడికి గుండెపోటు? ఏమిటన్న సందేహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఉదంతంలో బాలుడు ఉన్నట్లుండి కుప్పకూలిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకూ రెండో తరగతి చదివే పిల్లాడికి గుండెపోటు వస్తుందా? అంటే.. అరుదుగా వచ్చే వీలుందని వైద్యులు చెబుతున్నారు. పుట్టుకతోనే గుండె సమస్యలతో పుట్టే వారు.. థైరాయిడ్ రుగ్మత.. ఊబకాయం.. అధిక ఒత్తిడితోనూ గుండెపోటు వచ్చే వీలుందని చెబుతున్నారు. గుండెపోటు వచ్చే సమయంలో చాతీ నొప్పి.. భుజాలు.. మెడ.. దవడ.. వెన్ను నొప్పి వస్తాయి. వీటిని గుర్తించి వెంటనే వైద్యుల వద్దకు వెళ్లగలిగితే.. కొంత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. గుండె పోటుకు ముందు మైకం రావటం.. వాంతులు లాంటి లక్షణాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా గుండెపోటు ముప్పును కొంతమేర తప్పించే వీలుంది. ఏమైనా తాజా ఉదంతం మాత్రం పిల్లల తల్లిదండ్రులకు టెన్షన్ పుట్టిస్తోంది.

Tags:    

Similar News